
ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు అందరి నోళ్లలో చర్చగా మారింది. డబ్బు కోసం ఏదైనా చేసే ఈ కాలంలో కూడా, నిజాయతీకి విలువ తగ్గలేదని నిరూపించాడు ఒక సాధారణ పండ్ల వ్యాపారి. తన వద్ద మరిచిపోయిన రూ.7 లక్షల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదుతో ఉన్న సంచిని ఎలాంటి ఆశ లేకుండా పోలీసులకు అప్పగించి, షేక్ గౌస్ బాషా అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనిగిరి పట్టణంలోని ఐస్‌పాల్ కూడలిలో రోజూ పండ్లు అమ్ముకునే గౌస్ బాషా దుకాణానికి బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. కొనుగోలు ముగించుకుని వెళ్లిపోయేటప్పుడు మల్లయ్య తన చేతిసంచిని అక్కడే మరిచిపోయారు. కొంతసేపటికి ఆ సంచిని గమనించిన గౌస్ బాషా, దానిని యజమానికి తిరిగి ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే మల్లయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆ సంచిని తెరిచి చూసిన గౌస్ బాషా.. అందులో బంగారు ఆభరణాలు మరియు రూ.50 వేల నగదు ఉన్నట్లు గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ సంచిని తీసుకుని నేరుగా కనిగిరి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అప్పగించారు.
పోలీసులు ఆ సంచిని పరిశీలించగా, దానిలో ఉన్న వస్తువులు, వివరాల ఆధారంగా అది బేతంశెట్టి మల్లయ్యదేనని నిర్ధారించారు. అనంతరం డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఎస్‌ఐ తి. శ్రీరామ్‌లు మల్లయ్యకు సంచిని తిరిగి అందజేశారు. గౌస్ బాషా చూపిన నిజాయతీని అధికారులు అభినందించారు. ఆయనను పూలమాలతో సత్కరించి ప్రశంసించారు. ఈ సంఘటనతో కనిగిరి ప్రజలు గౌస్ బాషాను నిజాయతీకి నిదర్శనంగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు దొరికినా ఆశపడకుండా తిరిగి ఇచ్చిన గౌస్ బాషా వంటి మనుషుల వల్లే సమాజంపై ఇంకా నమ్మకం మిగిలి ఉంది అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Gaus Basha With Police
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..