Andhra: మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం పని చేశాడో తెలుసా..?

మృతదేహాన్ని ఇంటికి తరలించే బాధ్యతలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ మానవత్వాన్ని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. మార్గమధ్యలో మృతురాలి కుమారుడిని నీళ్లు తీసుకురావాలని పంపించి, ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు. పోలీసుల విచారణలో నిందితుడు పట్టుబడగా, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు.

Andhra: మహిళ మృతదేహాన్ని తరలిస్తూ ఈ అంబులెన్స్ డ్రైవర్ ఏం పని చేశాడో తెలుసా..?
Ambulance (Representative image )

Edited By:

Updated on: Jul 22, 2026 | 12:20 PM

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన నీచమైన పని కడప జిల్లాలో కలకలం రేపింది. ఆస్పత్రిలో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని ఇంటికి తరలిస్తున్న సమయంలో ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మార్గమధ్యలో వాహనాన్ని ఆపాడు. అంబులెన్స్‌లో ఉన్న మృతురాలి కుమారుడిని మంచినీటి బాటిల్ తీసుకురావాలని చెప్పి కిందకు పంపినట్లు సమాచారం. ఆ సమయంలో మృతురాలి చేతికి ఉన్న రెండు బంగారు గాజుల్లో ఒక గాజును చాకచక్యంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్ద దింపి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బంగారు గాజు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో అంబులెన్స్ డ్రైవర్‌నే నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని తరలించే బాధ్యతలో ఉన్న వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మానవత్వాన్ని మరిచి చేసిన ఈ చర్యపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us