Jawan Jaswant Reddy dead body reached to Bapatla: జమ్ము సరిహద్దుల్లో ఉగ్రపోరులో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి డెడ్‌బాడీ స్వస్థలానికి చేరుకుంది. కొద్దిసేపట్లో జస్వంత్ రెడ్డి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జస్వంత్‌రెడ్డి అంత్యక్రియల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొననున్నారు. బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాజౌరి సెక్టార్‌లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో ఎదురొడ్డి పోరాడాడు జశ్వంత్‌రెడ్డి. ఉగ్రవాదులపై బులెట్ల వర్షం కురిపించాడు. ఆ శత్రు మూకల అడుగు దేశం లోపల పడకుండా కాల్చి చంపాడు. అదే ప్రయత్నంలో తానూ అమరుడయ్యాడు జశ్వంత్‌రెడ్డి. అయితే, ఈ ఆషాడం అయిపోగానే జశ్వంత్‌రెడ్డికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కానీ ఈలోపే తమ బిడ్డ అనంతలోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తలిదండ్రులను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తోంది. కన్నబిడ్డ ఇక లేడని తలుచుకొని గుండెలు పగిలేలా రోదిస్తోంది ఆ మాతృమూర్తి.
18 ఏళ్లు నిండగానే ఇంకేవో ఉన్నత చదువులు, ఉద్యోగాల ఆలోచన లేకుండా.. సైన్యం వైపు చూశాడు జశ్వంత్. అనుకున్నట్లుగానే సెలక్ట్ అయ్యాడు. 2016 బ్యాచ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ పోస్టింగ్ నీలగిరిలో చేశాడు. ఆ తర్వాత ఈ యంగ్ తరంగ్‌ని జమ్ముకశ్మీర్‌కి పంపింది ఆర్మీ. బోర్డర్‌లో పోస్టింగ్ అన్నా జంకులేకుండా వెళ్లాడు. చివరికి ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు జశ్వంత్‌రెడ్డి. అతన్ని తలచుకుని కొత్తపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Also… Suicide: మితిమీరిన అభిమానం.. నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పంటించుకుని అభిమాని ఆత్మహత్య