Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో అన్నదాతల మరణం కలచివేసిందని జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు… అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 73మంది కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటేసాగును నమ్ముకొన్నవారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతోందన్నారు. ప్రతి కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పవన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కొంతైనా ఊరట కోసం జనసేన పక్షాన ఆర్థిక సాయం అందిస్తాం. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ”ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉండాలని జనసేనా పార్టీ నిర్ణయించిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ త్వరలోనే పరామర్శిస్తానన్నారు పవన్ కల్యాణ్. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. కౌలు రైతుల బాధలు వింటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. రైతులు, కౌలు రైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది’’ అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉగాది పూట ఆ కుటుంబాలు దుఖంతో, బాధతో ఉండకూడదు… వారికి కొంతైనా ఊరటను ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనసేన పక్షాన ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించామన్నారు.
మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే. అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుందన్నారు. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.. పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు. ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు. కనీసం అధికారులు కూడా పరామర్శించకపోవడం విచారకరమన్నారు. జనసేన పార్టీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.