మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయి.. జనసేనాని పవన్ తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ నేతల అనాలోచిత విధానాలే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార...

మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయి.. జనసేనాని పవన్ తీవ్ర ఆగ్రహం
Pawan Kalyan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 08, 2022 | 4:06 PM

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ నేతల అనాలోచిత విధానాలే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. మొబైల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం(Power Crisis) ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందని ఆవేదన చెందారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. ఫలితంగా 2014 – 2019 సమయంలో విద్యుత్ కోతల ప్రభావం అంతగా లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (PPA) రద్దు చేసిందని చెప్పారు. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసిందని మండిపడ్డారు. రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పి, ప్రస్తుతం కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

ఉచితం అని చెప్పి 57 శాతం ఛార్జీలు పెంచారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం. అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నాయకత్వం ఇవాళ 57 శాతం ఛార్జీలు పెంచింది. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారు.

                             – పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు

రాష్ట్రంలో వేళాపాళా లేని విద్యుత్ కోతలతో విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ అన్నారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారని చెప్పారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నాయన్న జనసేనాని.. తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయని ఆవేదన చెందారు. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంట్ లో ఇక 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించిందని తెలిపారు. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారని ఆక్షేపించారు. విద్యుత్ కోతలు పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలిగించి, 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని.. ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించినట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి.

దేశంలో 18 ఏళ్ల నిండిన వారికి బూస్టర్ డోస్.. ఎప్పటి నుంచంటే.?

ఎగిసిపడుతున్న సముద్రపు అలల తాకిడిలో అందాల ముద్దుగుమ్మ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్..

Hyderabad: వారెవ్వా.. హోంగార్డ్ డెడికేషన్‌కు చీఫ్‌ జస్టిస్‌ ఫిదా.. కారు దిగి వచ్చి అభినందన