
గంటలు దాటాయి. రోజులు గడిచాయి. వారాలు మారుతున్నాయి. కానీ ఉత్కంఠ వీడ్డం లేదు. రెండున్నరేళ్ల చిన్నారి ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఏమైందో తెలియదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. దీంతో ఆ కుటుంబానికి క్షణం ఒక యుగంలా గడుస్తోంది. ఇంతకూ జాహ్నవికి ఏమయింది..? చిన్నారి జాడ ఇంతవరకూ తెలియలేదంటే ఏమై ఉండవచ్చు? కిడ్నాప్ అయిందా..? లేక ఊహించనిది ఇంకేమైనా అయిందా..? అనేది మిస్టరీగా మారింది.. కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్కకు..జీపీఎస్ ట్రాకర్ అమర్చి తోటల్లోకి వదిలారు పోలీసులు. రెండు గంటల పాటు తోట పరిసర ప్రాంతాల్లో తిరిగిన కుక్క.. చివరికి మళ్లీ ఇంటికే చేరుకోవడంతో ఆశించిన ఆధారాలు లభించలేదు.
దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలోని 50 ఎకరాల పామాయిల్ తోటకు గణేశ్-భవానీ దంపతులు కాపలదారులుగా పనిచేస్తున్నారు. వారి రెండేళ్ల కుమార్తె జాహ్నవి గత శనివారం అడవి వైపు వెళ్లింది. అయితే చిన్నారి ఎంతకూ తిరిగి రాకపోవడం పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది దాదాపు 500 ఎకరాల అటవీ కొండ ప్రాంతాన్ని గాలిస్తున్నారు.
జాహ్నవి వెంట వెళ్లిన కుక్క మంగళవారం మధ్యాహ్నం తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన పెరిగిపోతోంది. దీంతో నిజంగానే పాప అడవిలో తప్పిపోయిందా? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
వారం రోజులైనా చిన్నారి జాడ కనిపించకపోవడంతో కిడ్నాప్ అనుమానాలే బలపడుతున్నాయ్. అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
పాయింట్ నెంబర్ 1. రెండేళ్ల పాప ఎవరి సాయం లేకుండా కిలోమీటర్ల దూరం నడవగలదా?
2. పామాయిల్ తోటకు చుట్టూ మనిషి దూరలేని కంచె ఉంది. మరి పాప ఎలా దాటింది?
3. పెద్దవాళ్లే ఎక్కలేని కొండప్రాంతంలోకి పాప వెళ్లిందని ఎలా అనుకోగలం?
4. అది కూడా కాలిబాటకాదని, పెద్దవాళ్లే వెళ్లలేని తుప్పల్లోకి వెళ్తుందా?
5. జరగకూడనిది జరిగితే.. దుర్వాసన రాకుండా ఎలా ఉంటుంది?
6. కుక్క కూడా ఆ 400 మీటర్ల పరిధి దాటి వెళ్లడం లేదు
7. చిన్నారి తండ్రికి కొందరు స్థానికులతో ఆర్థిక లావాదేవీల్లో వివాదాలున్నాయి
8. తల్లి కూడా జాహ్నవి కిడ్నాప్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
స్థానికులు, బంధువులు కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిని పరిశీలిస్తే ఆధారాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కుమార్తె జాహ్నవి కనిపించిక ఆ తల్లి భవానీ పడుతున్న బాధ చూస్తే మనసు కలుక్కుమంటుంది. బోనులో ఉన్న కుక్క దగ్గరకు వెళ్లి భవానీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో అర్థమవుతుంది. జాను దగ్గరికి వెళ్తావా అంటూ కుక్కను పదేపదే అడుగుతోంది భవానీ.
మొన్ననే కుక్క తిరిగొచ్చిందని.. జానూ కూడా వచ్చేస్తుంది అనుకున్నానని చెబుతోంది భవాని. కానీ ఇంతవరకూ పాప ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
జాహ్నవి కుటుంబం ఉంటున్న పామాయిల్ తోట..దొండవాక పంచాయతీ CH అగ్రహారం పరిధిలో ఉంటుంది. ఆ తర్వాత నుంచి కొండ ప్రాంతం మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని కిలోమీటర్ల రేడియస్‌లో అంతా గాలించారు పోలీసులు. దట్టమైన పొదలు, నేలబావులు, చెరువులు అన్నీ వెతికారు. డ్రోన్ కెమెరాతోనూ అణువణువూ శోధించారు. పాప మిస్సైన తర్వాతి రోజు కొండ ప్రాంతాల్లో భారీవర్షం పడడంతో ఎక్కడైనా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయా..? అలాంటి చోట చిన్నారి ఉండొచ్చా అనే అనుమానంతో అక్కడా గాలించారు. కానీ ఎలాంటి క్లూ లేదు.
పోలీసులు తోట పరిసరాల్లోనే గాలిస్తున్నారు తప్ప..కిడ్నాప్ ఆంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని బస్టాండ్ తప్ప మరోచోట గాలించడం, సీసీ కెమెరాలను ట్రాక్ చేయడం వంటివి ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మరోవైపు జాహ్నవి కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం ప్రతి క్షణమొక యుగంలా మారింది.
జాను కోసం కదిలిన భైరవుడు.. జీపీఎస్ ట్రాకర్‌తో రంగంలోకి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..