రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్.. మరో అద్భుత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ విజయనగరంలో పర్యటించనున్న సీఎం జగన్.. “జగనన్న వసతి దీవెన” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తొలిసారిగా విజయనగరం జిల్లాకు వస్తుండటంతో భారీ జనసమీకరణకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
విద్యార్థుల చదువుకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలగకూడదన్న ఉద్దేశ్యంతో.. నవరత్నాల్లో ఒకటైన “జగనన్న వసతి దీవెన” కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,87,904 మందికి ఏడాదికి 20 వేల రూపాయలు ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలో 58,723 మందికి 20 వేల చొప్పున అందజేయనున్నారు. ఉన్నత చదువులు చదువుకొనే విద్యార్థినీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజన ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేల రూపాయలు ఇస్తామని గతంలోనే జగన్ ప్రకటించారు.
ఈ కార్యక్రమానంతరం.. మహిళలకు తగిన భద్రత, సత్వర న్యాయం కోసం ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్ స్టేషన్‌ను కూడా ప్రారంభించనున్నారు. సీఎం టూర్ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు.
విజయనగరం టూర్.. రూట్ మ్యాప్
సీఎం జగన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌లో విజయనగరానికి ఉదయం 11.30 నిమిషాలకు చేరుకుంటారు. అనంతరం అయ్యోధ్య మైదానంలో “జగనన్న వసతి దీవెన” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దిశా మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.