ప్రపంచంలో పులి మనుగడ ప్రమాదపు అంచుల్లో నిలుస్తోంది. గాంభీర్యం, రాజసంకు ప్రతీకగా నిలిచే పులి జాతిని రక్షించుకునేందుకు భారత ప్రభుత్వం గత 50 ఏళ్లకు పైగా ప్రాజెక్ట్ టైగర్‌ను చేపడుతోంది. ఈ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తున్నా.. పులుల మరణాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండటం జంతుప్రియులు, పర్యావరణవేత్తలను ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ (జులై 29) అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పులుల సంరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలంగాణలో పులుల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు ఉన్నాయి. అటు ఏపీలో నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం(NSTR) దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అభయారణ్యంలో ప్రస్తుతం 72 పులులు ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పులుల సంఖ్య పెంచడంపై ఎప్పటి నుండో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించారు. దీని ఫలితంగా గత కొంతకాలంగా నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ 3568 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఎన్ఎస్టిఆర్ పరిధిలో పల్నాడు జిల్లాలో ఈ మధ్య కాలంలో పులులు తరచు కనిపిస్తున్నాయి. దీంతో అటవీ శాఖాధికారులు వాటి సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.
పులల సంఖ్యను కచ్చితంగా గుర్తించేందుకు వాటి కదలికలు తెలుసుకునేందుకు ఇన్ ప్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కేవలం ఫగ్ మార్క్ ల ద్వారానే వీటిని గణించేవారు. అయితే ఇన్ ఫ్రారెడ్ కెమెరాల ద్వారా కచ్చితంగా వీటి సంఖ్యను తెలుసుకునే అవకాశం ఉండటంతో వీటినే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. పులిని గుర్తించి వాటికి ప్రత్యేక ఐడీని ఇస్తున్నారు.
పల్నాడు జిల్లా పరిధిలోని మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్లలోని బేస్ క్యాంపుల్లో ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరు ప్రతిరోజూ పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ వన్యప్రాణుల సంచారాన్ని గుర్తిస్తారు. వీటితో పాటు విజయపురి సౌత్ రేంజ్ అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చే శిరిగిరి పాడు, బటుకులపాయ, వరికపూడిశెల, పసువలు రేవు బీట్లలో నిరంతరం పులి సంచారం ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా లోయపల్లి, కాకిరాల, బొల్లాపల్లి, అడిగొప్పల, వెల్ధుర్తి బీట్లలో కూడా పులులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. విజయపురి సౌత్ అటవీ రేంజ్ లో ఐదు పులులున్నట్లు గుర్తించారు.
పులుల సంఖ్య పెరగడంతో వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేటగాళ్ల బారి నుండి వీటిని కాపాడేందుకు యాంటీ పోచింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి స్క్వాడ్ లో గిరిజనులను సభ్యులుగా ఉంచి వారి సాయంతో నలమల అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎవరైనా ఉచ్చులు, విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తున్నారు. మరోవైపు నీటి కొరత రాకుండా సాసర్ పిట్ లను ఏర్పాటు చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్ర గణనీయంగా ఉన్నట్లు పల్నాడు జిల్లా అటవీ శాఖాధికారి రామచంద్రరావు తెలిపారు. పులుల సంఖ్య పెరిగితే ఆ ప్రాంతంలో ఇతర వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. జింకలు వంటి వాటిని వేటాడటంతో వాటి సంఖ్య పెరగకుండా పర్యవరణ సమతుల్యత ఉంటుందన్నారు. పులులకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..