Andhra Pradesh: ఆ మిత్రుల్లో సీఎం అభ్యర్థి ఎవరు? పవన్ కల్యాణా? లేదంటే బీజేపీ వేరే ఆలోచన చేస్తుందా? ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉంది. కానీ అప్పుడే వారిద్దరి మధ్య సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై పంచాయితీ మొదలైంది. ఇందులో జనసేన స్పీడ్ పెంచింది. వెంటనే ప్రకటన రావాల్సిందేనని పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది.
2024 ఎన్నికల్లో తాను తగ్గేదేలేదంటూ పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్లు ఇవ్వడం ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరతీసింది. బీజేపీ, జనసేన మిత్రుల్లో ఎవరు సీఎం అభ్యర్థి అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టూర్‌లోనే పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ఆయన ప్రకటించాలని పట్టుబడుతోంది జనసేన. బీజేపీలో పవన్ కన్నా ఇమేజ్ ఉన్న నేత ఎవరూ లేరన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.
అయితే, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై రియాక్ట్ అవలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. దీనిపై టీవీ9 ప్రత్యేకంగా అడిగినా స్పందించలేదు. మరోవైపు బీజేపీతో ఉన్నా లేకపోయినా పవనే సీఎం అని జనసేన బలంగా వాదిస్తోంది. అంతేకాదు.. ఒంటరిగా వెళ్లినా గెలిచే సత్తా తమకు ఉందని గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. అయితే, ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని, ఇప్పుడు ఈ చర్చ అనవసరం అని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇదంతా వైసీపీ ట్రాప్ అని కూడా అంటున్నారు. ఇక బీజేపీ వెర్షన్ ఎలా ఉన్నా పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే తమ కార్యాచరణ మరోలా ఉంటుందంటూ సున్నితంగానే వార్నింగ్‌లు ఇస్తున్నారు జనసైనికులు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ అధిష్టానం, ఇటు పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.