Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నిజపాద దర్శన సేవలో ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి ముఖేష్ అంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం
రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది తిరుమలలోని శ్రీవారి ఆలయం అభివృద్ధి చెందుతూ.. మెరుగవుతూ ఉందన్నారు. మాకు అందరి ఆశీస్సులు ఉండాలని వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించానని అన్నారు పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.1.50 కోట్లు విరాళం ఇచ్చారు ముఖేష్ అంబానీ. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి డీడీని ముఖేష్ అంబానీ అందజేశారు.
గతంలో ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుమల వెంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందించారు. కోటి 11లక్షల రూపాయలను శ్రీవారి ఆలయానికి అందించగా.. ఆమొత్తాన్ని ఉచిత అన్నదాన కార్యక్రమానికి వినియోగించిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..