
రిజర్వ్ చేసిన సీటులో ప్రయాణికుడికి స్థానం ఇవ్వకుండా, ఆ సీటును స్వయంగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై సదరన్ రైల్వేకు కేరళ వినియోగదారుల కమిషన్ గట్టి ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుడికి కలిగిన మానసిక వేదన, ఇబ్బందులకు పరిహారంగా రూ.50 వేల చెల్లించాలని ఎర్నాకులం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖను ఆదేశించింది. నష్టపరిహారంతో పాటు, వ్యాజ్యపు ఖర్చుల కింద రూ. 3,000 కూడా చెల్లించాలని కమిషన్ రైల్వేకు సూచించింది.
ఎర్నాకులం జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు డి.బి. బినూ, సభ్యులు రామచంద్రన్ వి, శ్రీవిద్య టి.ఎన్.లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఫిర్యాదుదారుడికి రూ.50 వేల పరిహారం, కేసు ఖర్చుల కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా టికెట్ ధరను కూడా తిరిగి చెల్లించాలని సూచించింది.
ఫిర్యాదుదారుడు తన భార్యతో కలిసి అలువ నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే రైలు అలువ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో తనకు కేటాయించిన సీటును TTE ఆక్రమించుకున్నాడు. అంతేకాదు తన సూట్‌కేసును గొలుసుతో కట్టి అక్కడ ఉంచాడని ఆరోపించాడు. సీటు ఖాళీ చేయాలని కోరినప్పటికీ, మరో సీటులో సర్దుకుపోవాలని TTE చెప్పాడని, ఇతర ప్రయాణికుల సమక్షంలో తనను, తన భార్యను ఇబ్బందులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయిస్తూ సేవా లోపం, అన్యాయమైన వ్యాపార పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించాడు.
అయితే సదరన్ రైల్వే మాత్రం తన వాదనలో ప్రయాణికుడు, అతని భార్యకు వేర్వేరు బేల్లో బెర్తులు కేటాయించామని, ఇద్దరూ ఒకే బేలో ప్రయాణించేలా TTE సహాయం చేశారని తెలిపింది. ప్రయాణికుడు ఆ ఏర్పాటును అంగీకరించాడని, తర్వాత అసలు బెర్త్‌నే కావాలని కోరడం సమంజసం కాదని వాదించింది. విధి నిర్వహణలో భాగంగా ప్రతి స్టేషన్‌లో దిగేందుకు వీలుగా TTE డోర్ సమీపంలోని సీటును ఉపయోగించుకున్నారని పేర్కొంది. అయితే రికార్డులో ఉన్న ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలించిన కమిషన్, ఫిర్యాదుదారుడికి కేటాయించిన సీటుపై సూట్‌కేసు ఉంచి గొలుసుతో తాళం వేసి ఉన్నట్లు గుర్తించింది. దీంతో రైల్వే వాదనలను తిరస్కరించింది.
ప్రయాణికుడు తన కష్టార్జితంతో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రిజర్వ్ చేసుకున్న సీటును TTE తన సౌకర్యం కోసం ఉపయోగించుకోవడం సేవా లోపమేనని కమిషన్ స్పష్టం చేసింది. ప్రయాణికుల హక్కులు, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని పేర్కొంది. తీర్పు ప్రతిని అందుకున్న 45 రోజుల్లోపు పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఆలస్యం జరిగితే చెల్లించాల్సిన మొత్తంపై 6 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుందని కమిషన్ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..