Andhra Pradesh: కోనసీమ జిల్లా పి.గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. 15 మంది రైతులు మృత్యువు అంచులదాకా వెళ్లి వచ్చారు. 15 మంది పాడి రైతులు గోదావరి నదిలో కొట్టుకుపోయారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోగా.. ఇంజిన్ బోట్ల సాయంతో అధికారులు వారిని సురక్షితంగా కాపాడారు. వివరాల్లోకెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంకకు చెందిన 15 మంది పాడి రైతులు లంకలో ఉండే పశువులను వడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజెక్షన్ పడవపై వెళ్ళారు. రైతులు పశువులను తీసుకువస్తుండగా.. గోదావరి మధ్యలోనే పడవ ఆగిపోయింది. దాంతో గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు యానాం వద్ద మసకపల్లి వరకు కొట్టుకుపోయారు రైతులు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుంచి ఇంజన్ బోట్ల సాయంతో రైతులను కాపాడారు. దాంతో ఆ 15 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడిన అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.