అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో గత నాలుగు రోజులుగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం కూడా అక్కడక్కడ చినుకులు పడ్డాయి. ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్-తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో అక్టోబర్ 8వ తేదీ ( శనివారం ) కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అక్టోబర్ 9వ తేదీ ( ఆదివారం ) కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 9వ తేదీన ఏర్పడే అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో వైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిరిపురం రెల్లిగెడ్డకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతి పెరగడంతో పొందూరు, సంతకవిటి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భోగాపురం మండలం ముక్కాం దగ్గర సముద్రం దూసుకురావడంతో తీరం మొత్తం భారీగా కోతకు గురైంది.
అల్పపీడన ప్రభావం నాలుగు రోజులు ఉంటుందని.. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల శని, ఆది వారాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు.
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 1,47,405 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 2,05,432 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..