Cyclone Alert: తరుముకొస్తున్న తుపాన్‌ ముప్పు.. అప్రమత్తమైన సర్కార్! హెచ్చరికలు జారీ..

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో అల్పపీడనంగా మారి పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడనుంది. ఈనెల 24 నాటికి వాయుగుండం గా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది..

Cyclone Alert: తరుముకొస్తున్న తుపాన్‌ ముప్పు.. అప్రమత్తమైన సర్కార్! హెచ్చరికలు జారీ..
Andhra Pradesh Cyclone Forecast

Updated on: Nov 21, 2025 | 7:56 AM

అమరావతి, నవంబర్‌ 21: రాష్ట్రానికి మరో తుపాన్‌ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. మొంథా తుపాన్‌ విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే రాష్ట్రాన్ని మరోమారు భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్‌ 22 (శనివారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో వరుసగా 3 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101ను ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా రోజుల్లో అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది. నవంబర్‌ 23వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నవంబర్ 21,22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. అయితే చలి తీవ్రత మాత్రం కొనసాగుతుందని తెలిపింది. నవంబర్‌ 23వ తేదీ నుంచి 25 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2, 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.

గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలివే..

  • పటాన్ చెరువు.. 09
  • మెదక్.. 9.2
  • ఆదిలాబాద్.. 10.4
  • రాజేంద్ర నగర్.. 11.5
  • హనుమకొండ.. 12.5
  • హయత్ నగర్.. 12.6
  • దుండిగల్.. 13
  • హైదరాబాద్.. 13.1
  • నిజామాబాద్.. 13.4
  • రామగుండం.. 14.6
  • హకింపేట్.. 14.6
  • నల్లగొండ.. 15
  • ఖమ్మం.. 15.2
  • మహబూబ్ నగర్..16
  • భద్రాచలం.. 16.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.