శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో పురాతన దేవతా విగ్రహాలు కలకలం రేపాయి. హిరమండలం గొట్టాబ్యారేజీ దిగువున వంశధార నదిలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయుని విగ్రహాలు మత్స్య కారుడి వలకు దొరికాయి. భగీరధపురంకి చెందిన పూలసరి శంకరరావు అనే మత్స్యకారుడు చేపల కోసం నదిలో వల వేయగా వలకు బరువుగా తగిలింది.దాంతో కష్టం మీద వలను పైకి లాగి చూడగా వలలో లక్ష్మి దేవి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు లభ్యమయ్యాయి. వాటిని చూసిన మత్స్యకారుడు ఏం చెయ్యాలో తెలియక వాటిని తిరిగి నదిలో వేసేశాడు.
తరవాత జరిగిన విషయం స్థానికులకు చెప్పగా మిగిలిన మత్స్యకారులతో కలిసి తిరిగి నదిలో వెతకగా లక్ష్మి దేవి,గణపతి విగ్రహాలు మాత్రమే దొరికాయి. హనుమంతుని విగ్రహం కోసం వెతికినా దొరకలేదు. అలా దొరికిన లక్ష్మి,గణపతి విగ్రహాలను స్థానికంగా ఉన్న గొట్ట పోలమ్మ ఆలయంలో ఉంచి పూజలు చేస్తున్నారు స్థానికులు. నదిలో విగ్రహాలు దొరకటంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.వాటిని చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోలమ్మ ఆలయానికి చేరుకుంటున్నారు. నదిలో విగ్రహాలు దొరకటం భగవంతుని మహిమగా స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దొరికిన విగ్రహాలు ఏ కాలం నాటివి, ఏ లోహంతో తయారు చేయబడ్డవి వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..