Vande Bharat Express: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ ట్రైన్.. ఎప్పుడంటే?

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. దేశంలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన ఈ ట్రైన్ త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది.

Vande Bharat Express: గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ ట్రైన్.. ఎప్పుడంటే?
Vande Bharat Express

Updated on: Dec 28, 2022 | 9:20 AM

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. దేశంలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన ఈ ట్రైన్ త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. మొదటిగా సికింద్రాబాద్, విజయవాడ మధ్య ఈ ట్రైన్ నడుస్తుందని.. ఆ తర్వాత ఈ సర్వీస్‌ను విశాఖపట్నం వరకు పొడిగిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయా రూట్ల మధ్య ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు జరుగుతున్నాయి. ఇక అవి పూర్తి కాగానే అఫీషియల్ డేట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఇదిలా ఉంటే.. మొదటిగా డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు ఆలస్యం కావడంతో.. వందేభారత్ ట్రైన్ కోసం తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు మరో ఆరు నెలలు వేచి చూడాల్సిందేనని సమాచారం.

ప్రస్తుతం సికింద్రాబాద్-విజయవాడ వయా కాజీపేట్ సెక్షన్‌లో గరిష్ట వేగం గంటకు 130 కి.మీ., ఇప్పుడున్న ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 110 కి.మీ. ఈ క్రమంలోనే మరింత వేగవంతమైన రైళ్లను అనుమతించడానికి ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు నిర్వహిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్ రైళ్లను నడపాలని కేంద్రం భావిస్తోంది. మొదటి రైలు సికింద్రాబాద్-విజయవాడ రూట్‌లో.. ఆ తర్వాత ఈ సర్వీస్‌ను విశాఖపట్నం వరకు పొడిగించనుండగా.. ఇక రెండో రైలును సికింద్రాబాద్-తిరుపతి వయా విజయవాడ మధ్య నడపనున్నట్లు తెలుస్తోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి విజయవాడ ప్రయాణ సమయాన్ని ఆరు గంటల నుంచి నాలుగు గంటలకు కుదిస్తుంది.

కాగా, నాలుగేళ్లలో 475 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తయారుచేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆగస్టు నాటికి కనీసం 75 రైళ్లు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో నడపాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆరు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. మరోవైపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూర్తిగా ఆటోమేటిక్ డోర్లు, ఎయిర్ కండిషన్డ్ కంపార్ట్‌మెంట్లతో కూడిన భారతదేశపు మొట్టమొదటి ఇంజన్ లేని రైలు. ఇందులో రాబోయే రోజుల్లో స్లీపర్ క్లాస్ కోచ్‌లను కూడా కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రైళ్లలో ఆన్-బోర్డ్ Wi-Fi, రాబోయే స్టేషన్ గురించి ప్రయాణీకులను అప్రమత్తం చేసే ఆటోమేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉన్నాయి.