రోడ్డున పడ్డారు ఓ మహిళా సర్పంచ్. ఆమె గ్రామానికి ప్రధమ పౌరురాలు… గ్రామంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఆ మహిళా సర్పంచ్.. అయితేనేం.. ఓ మహిళగా సొంత కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఎదురయింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళా సర్పంచ్‌ను.. భర్త తరపు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన శ్రీసత్య సాయి జిల్లాలో వెలుగు చూసింది.
లేపాక్షి మండలం సిరివరం సర్పంచ్ నేత్రావతిని భర్త తరపు కుటుంబ సభ్యులే ఇంట్లో నుంచి గెంటేశారు. అంతేకాదు ఇంటికి తాళాలు వేసి, బయటకు పంపించి రోడ్డు పాలు చేశారు. ఆరు నెలల క్రితం అనారోగ్యంతో సర్పంచ్ నేత్రావతి భర్త శ్రీనివాసులు మృతి చెందారు. భర్త చనిపోయిన దగ్గర నుంచి సర్పంచ్ నేత్రావతికి కుటుంబ సభ్యుల నుంచే సమస్యలు ఎదురయ్యాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న సర్పంచ్ నేత్రావతి.. కుటుంబ పోషణ కోసం తన భర్తకు రావాల్సిన వాటా ఇవ్వాలని కోరుతోంది.
అయితే వాటా ఇచ్చేది లేదని, భర్త తరపు బంధువులు ఇంట్లో నుంచి గెంటేశారు. ఆఖరికి సర్పంచ్ నేత్రావతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా.. న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ నేత్రావతే.. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదురవడంతో.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చేసేదీలేక తాళం వేసి ఉన్న ఇంటి ముందే బైఠాయించింది. నేత్రావతిని సర్పంచిగా చూడకపోయినా.. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ సాటి మహిళగా అయినా ఆదుకోవాలని గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులకు సూచించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..