అమ్మ బాబోయ్..! ఆ చేపలు తింటే చావు ఖాయం.. మోగుతున్న వార్నింగ్‌ బెల్స్‌..!

చేపల కూర తింటే శరీరానికి చేవ (బలం) వస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దందా చూస్తే మాత్రం.. ఆ చేపలు తింటే చావు ఖాయం అని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. చేపల కూర సంగతి దేవుడెరుగు కానీ, ప్రజల లైఫ్‌ను ఫ్రై చేసేలా ఇక్కడ ఏడు చేపల కథను మించిన ఒక చీకటి అక్రమ దందా నడుస్తోంది.

అమ్మ బాబోయ్..! ఆ చేపలు తింటే చావు ఖాయం.. మోగుతున్న వార్నింగ్‌ బెల్స్‌..!
Fish Market

Updated on: May 17, 2026 | 6:12 AM

చేపల కూర తింటే శరీరానికి చేవ (బలం) వస్తుందని అందరూ నమ్ముతారు. కానీ ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దందా చూస్తే మాత్రం.. ఆ చేపలు తింటే చావు ఖాయం అని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. చేపల కూర సంగతి దేవుడెరుగు కానీ, ప్రజల లైఫ్‌ను ఫ్రై చేసేలా ఇక్కడ ఏడు చేపల కథను మించిన ఒక చీకటి అక్రమ దందా నడుస్తోంది.

ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువుల వద్దకు టీవీ9 ప్రతినిధుల బృందం వెళ్ళినప్పుడు అక్కడి దృశ్యాలు షాక్‌కు గురిచేశాయి. అక్కడ చెరువు గట్లపై బైక్‌లతో ఉన్న కొందరు వ్యక్తులు మీడియా టీమ్‌ను చూడగానే ముఖం చాటేస్తూ, బండితో సహా పరారయ్యారు. తడబడుతూ వారు పారిపోవడాన్ని బట్టే అర్థమవుతోంది. అక్కడ ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని! వారు చేస్తున్న పని ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎంతటి ముప్పు తెస్తుందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ బైక్‌లపై ఉన్న బ్లూ కలర్ డ్రమ్ముల్లోనే అసలు సీక్రెట్ దాగి ఉంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపల చెరువుల్లో కోడి వ్యర్థాలను దాణాగా వేయడం పూర్తిగా నిషేధం. కానీ ఇక్కడి నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోడి వ్యర్థాలను, కుళ్లిన మాంసాన్ని డ్రమ్ముల కొద్దీ తెచ్చి నేరుగా చేపల చెరువుల్లో డంప్ చేస్తున్నారు. ఆ సీన్ చూస్తేనే కడుపులో తిప్పేసి ఢోకు వస్తుంది. మరి ఇంతటి దారుణమైన, కలుషితమైన వాతావరణంలో పెరిగే చేపలను తింటే మనుషుల పరిస్థితి ఏంటి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘క్యాట్‌ఫిష్’ పెంపకంపై ఎప్పుడో నిషేధం విధించాయి. అయినప్పటికీ, ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు స్వార్థపరులు ధనార్జనే ధ్యేయంగా ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్యాట్‌ఫిష్‌లకు కుళ్లిన కోడి మాంసాన్ని ఆహారంగా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక్కడి చెరువుల నుండి రోజూ క్వింటాళ్ల కొద్దీ క్యాట్‌ఫిష్ విజయవాడ మార్కెట్‌కు తరలుతోంది. ఈ చేపలను తింటే ‘బకెట్ తన్నేయడం’ (చనిపోవడం) ఖాయమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

స్థానికుల భయాందోళనలు 100% నిజమేనని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి కుళ్లిన వ్యర్థాలను తిని పెరిగే చేపలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు, తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, ఈ అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, తాము కొరడా ఝలిపిస్తూనే ఉన్నామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్టీఆర్ జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ చక్రాణి హెచ్చరించారు. గ్రౌండ్ రియాలిటీ మాత్రం భిన్నంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us