Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో మంగళవారం భారీ వర్షం విధ్వంసం సృష్టించింది. జిల్లా అంతటా హైవేలు, నివాస కాలనీలలో భారీ వరదలు సంభవించాయి. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలో.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రోడ్లపై మోకాళ్లలోతు వరదలోనే ప్రజలు, వాహనాలు తిరుగుతున్నట్లుగా చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నీటిలో మునిగిపోయిన ఒక కారు పార్కింగ్ ప్లేస్‌లోంచి వరద ఉధృతికి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. గత 24 గంటల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార, నాగావళి, బహుదా తదితర నదులకు భారీ వరదలు వచ్చినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉంది.
పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాలు కాకుండా శ్రీకాకుళం జిల్లా పరిధిలో కురిసిన వర్షాలతో సెప్టెంబర్ 13 న జిల్లాలో వరద పొటెత్తింది. గత వారం రోజులుగా నదులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే నాగావళి నదికి 30,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. తరువాత 20,000 క్యూసెక్కులతో బాహుదా నిండుకుండలా మారింది. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళంలో జనజీవనం స్తంభించింది.
శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బి. లఠ్కర్, ఇతర అధికారులు పెదపాడు ఇతర ప్రాంతాలలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు సహాయక చర్యలను సమీక్షించారు.
IMD నవీకరణల ప్రకారం, మంగళవారం ఉదయం నాటికి శ్రీకాకుళం పట్టణంలో 58.8mm వర్షపాతం నమోదైంది. గార మండలంతో సహా ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా 128.4mm వర్షపాతం నమోదైంది. తరువాత పోలాకి 64.2mm వర్షపాతం నమోదైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి