బీటెక్ స్టూడెంట్స్… సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ మధ్య గంజాయి, డ్రగ్స్ కేసులో దొరికిపోతున్నారు. పట్టుబడువారంతా ఎక్కువగా 25 ఏళ్ల లోపు వారే. మంచిగా చదువుకున్నారు. సాప్ట్‌వేర్ ఇంజనీర్లు అయ్యారు. కానీ విలాసాలకు అలవాటుపడి వస్తున్న తప్పుడు మార్గంలో ప్రయాణించి పోలీసులుకు దొరికిపోతున్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు అయితే గంజాయికి బానిసలుగా మారి ఇళ్లలోనే మత్తు మొక్కలను పెంచుతున్నారు. దీంతో పోలీసులు.. మరింత అలెర్ట్ అయ్యారు. మత్తు అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి మాఫియా బెండు తీయడం సహా .పాత నేరస్తులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం.. మన్యం రైతులను అల్లం, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో పోలీసులు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
ఇదిలా ఉండగా.. అనకాపల్లి జిల్లాలో ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గంజాయి మాయమవ్వడం సంచలనంగా మారింది. కె.కోటపాడు పోలీసుస్టేషను నుంచి గంజాయి చోరీకి గురైంది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే.. ఇన్‌సైడ్ ఎంక్వైరీ వేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్‌కుమార్ ఇందులో కీలక పాత్రధారిగా గుర్తించారు. హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కె.కోటపాడు ఎస్‌ఐ ధనుంజయ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఇటీవల పట్టుకున్న గంజాయిని పోలీసుస్టేషన్‌లో స్టోర్ చేశామని… ఇందులో 200 కేజీలు ఈ నెల 3న చోరీకి గురైందని తెలిపారు. విచారణ చేయగా హెడ్ కానిస్టేబుల్ శ్యామ్‌కుమార్ సాయంతో ఏ.కోడూరుకు చెందిన శెట్టి సందీప్‌కుమార్ చోరీ చేసినట్లు తేలిందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్యామ్‌కుమార్, శెట్టి సంజీవ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులు మరో ముగ్గురు మైనర్లు సహకారం తీసుకున్నారని, గంజాయిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..