కుక్కల ఇంజెక్షన్‌తో హత్య.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బావకు కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణ కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలుకు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో నిందితుడు హరికృష్ణ, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

కుక్కల ఇంజెక్షన్‌తో హత్య.. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న నిందితుడు!
Srihari And Harikrishna

Edited By:

Updated on: Jul 14, 2026 | 5:15 PM

నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మృతుడి బావమరిది హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఘటన సంచలనంగా మారగా ఊహించని మలుపు తీసుకుంది. శ్రీహరిది సాధారణ మరణం అనుకున్నారు అంతా.. అనుమానం వచ్చినా మృతుడి బావమరిది మాత్రం అందరినీ పక్కదోవ పట్టించాడు. నెల తర్వాత సంచలన విషయం బయట పడింది. అది సాధారణ మరణం కాదు, హత్య అని తేలింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్తి, అప్పుల వ్యవహారం చివరకు దారుణ హత్యకు దారితీసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరి అనుమానాస్పద మృతిగా భావించిన కేసు చివరకు హత్యగా తేలింది. ఈ కేసులో మృతుడి సొంత బావమరిది హరికృష్ణ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. శ్రీహరి గతంలో హరికృష్ణకు పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చారు. ఇటీవల ఇల్లు నిర్మించుకోవడానికి ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరడంతో హరికృష్ణ, శ్రీహరి హత్యకు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం మరో ఇద్దరి సహాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 15న దేవాలయ దర్శనానికి వెళ్దామని నమ్మించి శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకెళ్లిన హరికృష్ణ, తిరుగు ప్రయాణంలో చేజర్ల మండలం సమీపంలో వాహనాన్ని ఆపాడు. ముందుగానే అక్కడ వేచి ఉన్న ఇద్దరు వ్యక్తులు శ్రీహరిని అదుపులోకి తీసుకోగా, అనంతరం అధిక మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆయన మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. శ్రీహరి మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించడంతో సహోద్యోగులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ఫిర్యాదు రాకపోవడంతో కేసు ముందుకు సాగలేదు. అనంతరం అంత్యక్రియల విషయంలో కూడా తొందరపాటుగా దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అయితే శ్రీహరి మరణం తర్వాత మొత్తం ఆస్తి తనకు ఇవ్వాలని హరికృష్ణ ఒత్తిడి తేవడంతో మృతుడి భార్య లావణ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తులో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారయ్యాడు.

పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది అంతా బదిలీ..

ఈ కేసు దర్యాప్తులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సీఐతో పాటు ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 23 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు. ఒకే కేసు నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున బదిలీలు జరగడం అరుదైన ఘటనగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, తనపై ఉచ్చు బిగుస్తోందని గ్రహించిన హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కేసు మరింత సంచలనంగా మారింది. అయితే, హరికృష్ణ ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాడు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us