
గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌కు బంధువైన రేపల్లెకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. శుభకార్యాలకు వచ్చి వెళ్లే క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన ఆ యువతి హైదరాబాద్ లోనే ఉంటుంది. వీరి ప్రేమ విషయాన్ని పెద్దలు అంగీకరించలేదు. పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించిన వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దీ రోజులకు పెద్దలు కూడా అంగీకరించి కట్న కానుకలు కూడా ఇచ్చారు. రూ.10లక్షల నగదు, పదిహేను సవర్ల బంగారు ఆభరణాలతో పాటు ఇతర లాంఛనాలు కూడా అందించారు. కొద్ది రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. అప్పటి నుండి శ్రీకాంత్ ఆమెను దూరం పెట్టడంతో పాటు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు.
ఆ యువతి బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల మద్య పంచాయితీ చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. ఈ కేసు కోర్టులో ఉండగానే శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా మరొక సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. 2023లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో రూ.5 లక్షల కట్నం, లాంఛనాలు ఇచ్చారు. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమెను శ్రీకాంత్ పుట్టింటి వద్ద వదిలి వెళ్లాడు. వీరికి బాబు పుట్టాడు. బాబు పుట్టిన సమయంలోనే ఖమ్మం యువతికి శ్రీకాంత్‌కు అంతకముందే పెళ్లైందని ఆమెకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె శ్రీకాంత్‌ను నిలదీసింది.
అప్పటి నుండి శ్రీకాంత్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. గట్టిగా ప్రశ్నిస్తే అసలు పెళ్లే చేసుకోలేదని సహజీవనం మాత్రమే చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ భార్యలు ఒకరి తర్వాత మరొకరు శ్రీకాంత్‌ను ప్రశ్నిస్తుండటంతో వారికి చెక్ పెట్టేందుకు మూడో వివాహం చేసుకోబోతున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు బయటపెట్టాడు. దీంతో ఇద్దరూ బాధితులు కలిసి గుంటూరు ఎస్పీని ఆశ్రయించారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని తమ జీవితాలను నాశనం చేసిన శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యువతులు డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.