గుంటూరు, ఆగస్టు 13: టమాటా నిన్న మొన్నటి వరకు ఓ ఖరీదైన పండు నేడు కొంత మారింది. అదే టమాటాలు ఇప్పుడు ఓ నాయకుడికి గజమాలగా మారింది. గత నెల రోజులుగా ఎంత హాడావుడి సృష్టించిందో అందరికీ తెలిసిందే.. కేజీ 200 మార్కు దాటి పేదవాడి నోటికి అందకుండా పోయింది. దీంతో ప్రతిరోజూ టమాటాల కోసం ప్రజలు బారుల తీరిన స్టోరీలను మన చదువుకున్నాం.. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని కేజీ రూ. 50 సబ్సిడీపై అందించింది. మన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. టమటా పండించిన రైతు కోట్లు సంపాదిస్తే టమాటాల కోసం దొంగతనాలు, భౌతిక దాడులు కూడా జరిగాయి. ఇక రోజు వారి కూలీలు అయితే టమాటాను తన ఆహారాన్ని నుంచి ఎత్తి వేశారు. పెద్ద పెద్ద పుడ్ అందించే కంపెనీలకు కూడా టమాటా తో చేసే వంటకాలను అందించలేమంటూ బోర్డులు పెట్టేశాయి. అయితే గత కొద్దీ రోజులుగా టమాటా ధర తగ్గుముఖం పట్టింది. అయినా ఇప్పటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు.
ఇటువంటి అంశాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ది పార్టీలను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగిస్తుంటాయి. గతంలో ఉల్లి ధరల పెరుగుదలకు ప్రభుత్వాలే కుప్పకూలిన సంఘటనలు కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టమాటాల ధర అందుబాటులో లేదన్న విషయాన్ని అందరికి తెలియజేసేందుకు తెలుగు యువత
నేతలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. లోకేష్ పాదయాత్ర రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో ప్రస్తుతం జరుగుతుంది. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయి క్రిష్ణ టమాటాలతో గజ మాల చేయించి తాడికొండ మండలానికి వస్తున్న లోకేష్ కు ఘన స్వాగతం పలికాడు.
టమాటాలతో భారీ గజ మాల చేయించడం పార్టీలో చర్చకు దారి తీసింది. వినూత్న కార్యక్రమం అంటూనే ఏకంగా గజ మాల చేయించడంపై గుసగుసలాడుకుంటున్నారు. తెలుగు యువత నేతలు మాత్రం కూరగాయలు సామాన్యుడికి అందుబాటులో లేవన్న విషయం అందరకి తెలిసేలా గజమాల ఏర్పాటు చేశామంటున్నారు. టమాటా
గజమాలే కాదు రాజధాని నియోజకవర్గంలోకి అడుగు పెట్టే సమయంలో ప్రసిద్ది చెందిన గుంటూరు మిర్చితో కూడా గజమాలతోనే స్వాగతం పలికారు.
దీంతో నియోజకవర్గంలో అడుగుపెట్టే సమయంలో మిర్చి గజమాలతో స్వాగతం పలికిన తెలుగు యువత తర్వాత టమాటా గజమాలతో వీడ్కోలు పలకటం చర్చనీంయాంశంగా మారింది. మిర్చి కూడా గతంలో ఎప్పుడు లేనంతగా క్వింటా ఇరవై ఐదు వేల రూపాయల ధర పలికింది. అత్యధిక ధర పలుకుతున్న రెండు పంటలతో గజమాలలు
ఏర్పాటు చేయడం అటు పార్టీ వర్గాలనే కాదు ఇటు స్థానికులను కూడా ఆశ్చర్య చకితులను చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం