Andhra Pradesh: కృష్ణా జిల్లా విసన్నపేట మండలం పుట్రేలలో దారుణం చోటు చేసుకుంది. తాతా, మనవడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే, మనవడిని చంపేసి.. ఆ తరువాత తాత ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళితే.. విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన పాపారావుకు ఒక కుమార్తె వసంత లక్ష్మి ఉంది. వసంత లక్ష్మి అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పాపారావుకు చెప్పగా.. అంగీకరించలేదు. దాంతో వసంత లక్ష్మి తన తండ్రి మాటను కాదని రెండేళ్ల క్రితం వెంటేశ్వరరావును పెళ్లి చేసుకుంది. అయితే, చివరికి పాపారావు తన కూతురు ప్రేమను అంగీకరించాడు. ఈ క్రమంలోనే వసంత దంపతులు.. తమ కొడుకుని పాపారావు వద్ద ఉంచారు.
కానీ, తన కూతురు వసంత లక్ష్మి తనకు ఇష్టం లేని ప్రేమ వివాహాన్ని చేసుకోవడాన్ని ఇంకా మనసులో పెట్టుకున్న పాపారావు.. ఆ కోపాన్ని మనవడిపై చూపించాడని, ఆ కారణంగానే బాలుడిని చంపేశాడని బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మనవడిని చంపేసిన అనంతరం.. పాపారావు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, తాతా, మనవడి మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, రెవెన్యూ అధికారులు దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పాపారావు మృతి చెందిన ప్రాంతంలో పురుగుల మందును గుర్తించారు. మరోవైపు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాపారావు నివాసానికి వెళ్లగా.. కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం