Andhra Pradesh: అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్‌కు తల్లిదండ్రులు ఫిదా.. టీచర్ పనికి చప్పట్లు..

ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాయి. కడప జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించి, అదనపు ఖర్చు లేకుండా పిల్లలకు ఉత్తమ విద్యను అందించవచ్చని రుజువు చేశారు. ఇంగ్లీషులో స్టూడెంట్ స్పీచ్‌తో పేరెంట్స్ అవాక్కయ్యారు.

Andhra Pradesh: అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్‌కు తల్లిదండ్రులు ఫిదా.. టీచర్ పనికి చప్పట్లు..
Govt Student English Speech

Edited By: Krishna S

Updated on: Dec 06, 2025 | 5:28 PM

ఈ వేగవంతమైన ప్రపంచంలో తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ప్రతి తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. అప్పులు చేసి మరీ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లలో చేర్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు చక్కటి స్కిల్స్‌తో కూడిన నాణ్యమైన ఆంగ్ల విద్య అందుతోందని నిరూపించడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కడప జిల్లాలోని ఒక పల్లెటూరిలో జరిగిన సంఘటన ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను మరోసారి హైలైట్ చేసింది.

నలుగురు విద్యార్థులతో పాఠశాల

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సి.గోకులాపురం గ్రామంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘‘ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థులను చేర్పించి, తల్లిదండ్రులు అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోనవసరం లేదు. విద్యాబుద్ధులు నేర్పించడంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి” అని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలని వచ్చిన తనకు ఇక్కడ విద్యార్థులు లేకపోవడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. “పాఠశాలలో కేవలం నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది చూసి నాకు చాలా బాధ వేస్తుంది” అంటూ తల్లిదండ్రులను విన్నవించుకున్నారు.

ఇంగ్లీష్ స్పీచ్‌తో శభాష్

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆ ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులను కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్యకు నిదర్శనంగా.. తన పాఠశాలలోని ఓ విద్యార్థినితో ఆమె అక్కడున్న తల్లిదండ్రుల ముందు ఇంగ్లీష్‌లో స్పీచ్ ఇప్పించారు. ఆ విద్యార్థిని ప్రదర్శన చూసి సమావేశంలో ఉన్న తల్లిదండ్రులు శభాష్ అన్నారు.

ప్రభుత్వ టీచర్లకే ఆదర్శం

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది టీచర్లే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్న నేటి రోజుల్లో ఒక ప్రభుత్వ టీచర్ పల్లెకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల గొప్పదనాన్ని వివరించి, తమ పిల్లలను ఇక్కడే చేర్పించాలని కోరడం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో ప్రభుత్వమా ప్రైవేటా అనే దానికంటే పిల్లలకు ఎక్కడ మంచి విద్య లభిస్తే, అక్కడే చదివించడం ప్రతి తల్లిదండ్రుల మొదటి కర్తవ్యం. ఈ ఉపాధ్యాయురాలి ప్రయత్నం ప్రభుత్వ విద్యారంగంలో వస్తున్న సానుకూల మార్పులను సూచిస్తోంది.