Andhra Pradesh: నామినీ పత్రాల్లో పేరు మార్పు చేయలేదని ఘాతుకానికి ఒడిగట్టిన ప్రభుత్వ ఉద్యోగి..!

| Edited By: Balaraju Goud

Oct 29, 2024 | 6:59 PM

ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా కావడంతో అదే సమయంలోనే తన వెంట తెచ్చుకున్ని కత్తిని తీసుకుని రాజేష్ పై దాడి చేశాడు శ్రీనివాసరావు. విచక్షణారహితంగా పొడిచాడు.

Andhra Pradesh: నామినీ పత్రాల్లో పేరు మార్పు చేయలేదని ఘాతుకానికి ఒడిగట్టిన ప్రభుత్వ ఉద్యోగి..!
Guntur Knife Attack
Follow us on

గుంటూరులోని కేర్ ఇన్సూరెన్స్ కార్యాలయం అది.. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఒక్కసారిగి అరుపులు కేకలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని హడావుడిగా తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. మరొక వ్యక్తి మాత్రం తన వద్దకు వస్తే కిందకు దూకుతానంటూ బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కొక్కరిగా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అటుగా వెలుతున్న వారికి అక్కడ ఏంజరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అయితే కొద్దీ సేపటి తర్వాత యాభై ఏళ్లకు పైగా ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు నిర్భంధించి అక్కడ నుండి తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే..!

గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన కందుల శ్రీనివాసరావు పంచాయితీ రాజ్ శాఖలోని రూరల్ వాటర్ డిపార్ట్‌మెంట్ లో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం కేర్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ పాలసీ తీసుకున్నాడు. అందులో నామినీగా అతని భార్య పేరు పెట్టాడు. అయితే, తనకు ఇచ్చిన పత్రాల్లో భార్య పేరు పూర్తిగా లేకపోవడాన్ని శ్రీనివాసరావు గుర్తించాడు. నామినీ పేరును సరిచేయాలంటూ కేర్ ఇన్సూరెన్స్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అనేక సార్లు తిరిగినా నామినీ పేరు మార్చలేదు. ఇందులో భాగంగానే మంగళవారం(అక్టోబర్ 29) రోజు కూడా ఇన్సూరెన్స్ కార్యాలయానికి వచ్చి రాజేష్ అనే ఉద్యోగితో ఘర్షణ పడ్డాడు. ఎన్నిసార్లు తిప్పుకుంటారని ప్రశ్నించాడు. ఇద్దరి మద్య వాదన జరిగింది.

ఇద్దరి మధ్య గొడవ తీవ్రంగా కావడంతో అదే సమయంలోనే తన వెంట తెచ్చుకున్ని కత్తిని తీసుకుని రాజేష్ పై దాడి చేశాడు శ్రీనివాసరావు. విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో రాజేష్ కేకలు వేశాడు. బెంబెలెత్తిపోయిన ఉద్యోగులు వెంటనే తేరుకుని రాజేష్ ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమయంలోనే శ్రీనివాసరావు కిటీకి వద్దకు చేరుకొని తనను పట్టుకోవాలని చూస్తే దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో అరండల్‌పేట పోలీసులు అక్కడకు చేరుకుని చాకచక్యంగా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిని రాజేష్ గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్నాడు. అయితే నామినీ పేరు మార్చమంటే మార్చకుండా అనేక సార్లు కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని, అంతేకాకుండా అసభ్యకరంగా మాట్లాడారని శ్రీనివాసరావు ఆరోపిస్తుండగా, అటువంటిదేమీ లేదని భీమా కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..