
ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని శనివారం (జూన్ 20) విడుదల చేయనుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో మొత్తం 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.3,125.47 కోట్లు జమ కానున్నాయి. ఇందులో 45,69,817 మంది భూ యజమాని రైతులు, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న RoFR రైతు కుటుంబాలు ఉన్నాయి.
ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతున్న ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6 వేలు అందిస్తోంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, 2026-27 సంవత్సరానికి సంబంధించిన తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనుంది. గత ఏడాది ఈ పథకం కింద మొత్తం రూ.8,985.41 కోట్లు రైతులకు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఇక సీఎం చంద్రబాబు శనివారం (జూన్ 20) లింగంగుంట్ల గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…