Garlic: ఏం కొనేటట్టు లేదు.. కిలో వెల్లుల్లి రేటెంతో తెలిస్తే వామ్మో అంటారు

|

Feb 07, 2024 | 5:06 PM

ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర చికెన్‌ కంటే రెండింతలు ఉంది. నిత్యావసర సరకుల నిమిత్తం దుకాణానికి వెళ్లిన సామాన్యులు ఆకాశాన్నంటిన వెల్లుల్లిని చూసి కొనేందుకు జంకుతున్నారు. ఇది వరకు కిలో చొప్పున కొనుగోలు చేసిన గృహిణులు ఇప్పుడు పావుకిలో లేదంటే విడిగా రూ.20 లేదా రూ.30 కి తెచ్చుకుని వాడుకుంటున్నారు.

Garlic: ఏం కొనేటట్టు లేదు.. కిలో వెల్లుల్లి రేటెంతో తెలిస్తే వామ్మో అంటారు
Garlic
Follow us on

వేసవికాలం రాకముందే నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగి రాగా.. ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి ధర కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. 300 వరకు ఉన్న వెల్లుల్లి ధర.. రెండు వారాల్లోనే డబుల్‌ అయ్యే పరిస్థితి చేరింది.

వాస్తవానికి.. గతేడాది నవంబరు నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబరులో రిటైల్ మార్కెట్లలో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా.. హోల్ సేల్ మార్కెట్‌లో నాణ్యమైన వెల్లుల్లి 250 పలికింది. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగి.. ఏకంగా కిలో 500కి ఎగబాకింది. అల్లం ధర కూడా వెల్లుల్లితోపాటే పరుగులు పెడుతోంది. ఇప్పటికే కిలో అల్లం ధర 300 క్రాస్‌ అవుతోంది.  స్థానికంగా సాగు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటంతో ధరలు పెరిగాయి.

వంటల్లో అల్లం, వెల్లుల్లి కలిపి వాడటం తప్పనిసరి. పెరిగిన ధరలతో వంటల్లో అల్లం పరిమాణం తగ్గించి వేస్తున్నామని గృహిణులు చెబుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వీధుల్లో తిరిగే వ్యాపారులు ప్రస్తుతం ధరల పెరుగుదల కారణంగా పత్తా లేకుండా పోయారు. కృత్రిమ కొరత సృష్టించే పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమంటున్నారు కొందరు.  ఇక.. అల్లం, వెల్లుల్లితోపాటు.. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..