కల్తీపాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్.. చెలగాటమాడితే ఖబడ్దార్ అని హెచ్చరిక
నలుగురు ప్రాణాలు పోయాయి. ఇంకా 12మంది ఆరోగ్యం విషమంగా ఉంది. ఇంకొందరు హాస్పిటల్ బెడ్‌పై ఉన్నారు. అందరూ ఒకే ఏరియా, ఒకేప్రాంతం. లాలా చెరువు రాజమండ్రి. ఏం జరుగుతోందక్కడ అని ఆరాతీస్తే, కల్తీపాలే కారణమని తేలింది. ఇలాంటి కల్తీ ఘటనలు మనకు కొత్తకాదు. ఇన్ని వ్యవస్థలున్నా ఎందుకు కల్తీకి చెక్ పడటంలేదు..? ఎక్కడ లోపం ఉంది..? ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ?

పాలు…పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నిత్యావసరం. అలాంటిపాలు ఇప్పుడు కల్తీకావడంతో జనంలో ఆందోళన మొదలైంది. పైగా మనం తాగుతున్న పాలు 70శాతం కల్తీనే అంటూ నివేదికలు,నిపుణులు తేల్చడంతో ఇంకా భయం పట్టుకుంది. డిటర్జెంట్, యూరియా లాంటి వాటితో పాలను తయారు చేస్తూ జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కల్తీఘటనలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కల్తీపాల ఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యులను కఠినంగా శిక్షించడమే కాదు, భవిష్యత్‌లో రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కల్తీపాల నియంత్రణ..హౌఇజిట్ పాజిబుల్ అన్న ప్రశ్న జనంలో ఇప్పుడు వినిపిస్తోంది. రాజమండ్రిలో నలుగురు చనిపోవడం, డయాలలిస్ సమస్యలు తలెత్తడంతో అందరిలో గందరగోళం ఏర్పడింది. గతంలో కూడా కల్తీపాల విషాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. రాజమండ్రి ఘటనే మొదటిదికాదు. కల్తీ పాల సమస్యకు ప్రధాన కారణం, సరఫరా-డిమాండ్ మధ్య గ్యాప్ పెరగడమే. నివేదికల ప్రకారం భారత్‌లో వార్షికంగా సుమారు 220 నుంచి 230 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి జరుగుతోంది. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ప్రాసెస్డ్ డెయిరీ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల రోజువారీ డిమాండ్ కూడా వేగంగా పెరుగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం అవసరానికి, వినియోగానికి మధ్య సుమారు 10 నుంచి 15 శాతం లోటు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో డిమాండ్ సరఫరా మధ్య స్పేస్ ఎక్కువగా ఉండడంతో..ఆస్పేస్ ను భర్తీ చేసేందుకు కల్తీపాలు మార్కెట్లోకి వచ్చాయంటున్నారు నిపుణులు.
కల్తీ ఈరేంజ్‌లో పెరగడానికి కారణం, అధికారుల పర్యవేక్షణ లోపం, ఆహార భద్రత చట్టాల కింద పర్యవేక్షణ, నమూనాల సేకరణ, ల్యాబ్ పరీక్షలు, లైసెన్సింగ్, దాడులు, శిక్షలు..ఇవన్నీ నామమాత్రంగా మారడంతో కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పాల సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రవాణా పాయింట్లను తనిఖీ చేసే చర్యలు తీసుకుంటే, కల్తీ ఈస్థాయిలో ఉండేది కాదంటున్నారు. అలాగే ల్యాబ్ లకొరత కూడా కల్తీకి మరో కారణం. ల్యాబ్‌ల సంఖ్య, సిబ్బంది, పరికరాలు అంతంతమాత్రమే. అలాగే వినియోగదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. చాలామంది నాణ్యతను పరీక్షించకుండా ధర, అందుబాటు ఆధారంగా కొనుగోలు చేస్తారు. డిమాండ్ ఉన్నంతకాలం అక్రమ సరఫరా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కల్తీని అరికట్టాలంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అవసరం. పాలు సేకరణ మొదలయ్యే దశ నుంచే క్వాలిటీ చెక్ తప్పనిసరి చేయడం. అయితే కేవలం ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటే కల్తీ 100శాతం నియంత్రించలేరు. ఇందుకు వినియోగదారుల భాగస్వామ్యం ఉండాలి. అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలి. ఇలా ప్రభుత్వం, పరిశ్రమ, వినియోగదారులు—ముగ్గురూ కలిసే పని చేస్తేనే దీర్ఘకాల పరిష్కారం సాధ్యమంటున్నారు నిపుణులు. మరోవైపు ఆహార కల్తీపై FSSAI దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. పండుగల సీజన్లో ఆహార కల్తీ నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా అడల్ట్రేషన్ డ్రైవ్ చేపట్టిన FSSAI…స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులు, నూనెలు, ఇతర ఆహార పదార్థాల కల్తీపై దృష్టి పెట్టింది. “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్” ద్వారా అక్కడికక్కడే ల్యాబ్ టెస్టులు నిర్వహించి, కల్తీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.
