Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ నుంచి పిలుపు.. గురువారం తాడేపల్లిలో భేటీ..

|

May 31, 2023 | 7:47 PM

వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మరోసారి చర్చకు కేంద్రంగా మారారు. ఆయనకు CMO నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో సమావేశం కాబోతున్నారు బాలినేని. దీంతో మాజీ మంత్రిని సీఎం ఎందుకు పిలిచారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ నుంచి పిలుపు.. గురువారం తాడేపల్లిలో భేటీ..
Balineni Srinivasa Reddy
Follow us on

ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. సీనియర్‌ రాజకీయ వేత్తనైన తనను తప్పించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్‌ను కేబినెట్‌లో కొనసాగించడంపై కినుక వహించారు. మినిస్టర్‌ పదవి పోయినా.. రీజినల్‌ కోఆర్డినేటర్‌గా బాలినేనికి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్ఠానం. కొద్దిరోజుల తర్వాత పార్టీ బాధ్యతల్లోనూ కోత పెట్టారు. తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాలకే వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు బాలినేని. ఇటీవల కోఆర్డినేటర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.

పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. వైసీపీలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనేది బాలినేని ఆరోపణ. ఇదే అంశంపై ఆ మధ్య ఓపెన్‌ అయ్యారు కూడా. ఈ గొడవలు రగులుతున్న సమయంలోనే జిల్లా పర్యటనకు సీఎం జగన్‌ వచ్చిన సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్‌ ఏప్రిల్‌లో మార్కాపురం వచ్చినప్పుడు హెలిపాడ్‌ దగ్గరకు వెళ్తున్న బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు.

మనస్తాపం చెందిన బాలినేని సీఎం సభలో పాల్గొనకుండా అటు నుంచి అటే వెనక్కి వెళ్లిపోయారు. సీఎంవో నుంచి ఫోన్‌ చేసి బుజ్జగించడంతో సభకు తిరిగొచ్చారు బాలినేని. సభలో సీఎం పక్కనే కూర్చున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేసే బటన్‌ నొక్కే కార్యక్రమంలో బాలినేనితోనే ఆ పనిచేయించారు సీఎం.

సీఎంగా జగన్‌ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ఇప్పుడు సీఎంవో నుంచి బాలినేనికి పిలుపు రావడంతో మళ్లీ చర్చ మొదలైంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బాలినేనికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు సీఎం జగన్‌. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై చర్చిస్తారని చెబుతున్నా.. మీటింగ్‌పై మాత్రం పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం