కరోనా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా.. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని బీజేపీ నేత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డడారు. ఆదివారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ… సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ హెచ్చరించారన్నారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని, వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ రూ. 35,000 కోట్లు బడ్జెట్ కేటాయించారన్నారు.
రాష్ట్రంలో కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్నా… కొందరు రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారని కన్నా ఆరోపించారు. ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి చేయాల్సినంత ప్రయత్నం ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సిఎం లేఖ రాయటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మౌళికసదుపాయాలు కల్పన, వ్యాక్సిన్ తీసుకురావటంపై సీఎం శ్రద్ద పెట్టాలని సూచించారు. ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర బీజేపీ కూడా మద్దతిస్తోందని, కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని కన్నా లక్ష్మినారాయణ సూచించారు.