Kadapa: పొట్టలోకి దూసుకెళ్లిన తారాజువ్వ.. బయటకొచ్చిన పేగులు..

కడప నగరంలో శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదం కలకలం రేపింది. సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద కాల్చిన బాణాసంచా పక్కనే విధులు నిర్వహిస్తున్న హోటల్ సెక్యూరిటీ గార్డ్ హరీకి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. కడుపు భాగంలో తీవ్రంగా గాయపడిన హరిని వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు.

Kadapa: పొట్టలోకి దూసుకెళ్లిన తారాజువ్వ.. బయటకొచ్చిన పేగులు..
Firecracker Accident

Edited By:

Updated on: Jan 23, 2026 | 10:43 PM

బాణాసంచా కాల్చే వేళ కలిగే ఆనందం క్షణికం మాత్రమే.. అదే పేలుడు తప్పుగా తగిలితే వచ్చే దెబ్బ మాత్రం జీవితాంతం మిగిలే గాయం అవుతుంది. జాగ్రత్తలు అవసరమని తెలిసినా కొందరి నిర్లక్ష్యం వల్ల అమాయకుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆనందం కోసం కాల్చే బాణాసంచా, కొన్నిసార్లు జీవితాల్లో చీకటిని నింపుతోంది. కడప నగరంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్ర రాత్రి 11 గంటల వరకు కొనసాగడం ద్వారా వేడుకల ఘనత స్పష్టమైంది. అయితే ఈ వేడుకల మధ్య చోటుచేసుకున్న ఒక సంఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది.

కడపలోని సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో భారీగా బాణాసంచా కాల్చారు. అయితే ఆ బాణాసంచాలో ఒకటి పక్కనే ఉన్న హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న హరీ అనే వ్యక్తికి తగిలింది. పేలుడు తీవ్రతకు అతని కడుపులోని పేగులు బయటపడే స్థాయిలో గాయాలయ్యాయి. విధుల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న పోలీసులు, శోభాయాత్ర నిర్వాహకులు వెంటనే స్పందించి హరిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి హరికి అత్యవసరంగా కడుపు వద్ద శస్త్రచికిత్స నిర్వహించగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. హరి ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ అదే ప్రమాదం ప్రాణాలు తీసుంటే ఆ కుటుంబం పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. ఈ సంఘటన బాణాసంచా ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, జనాల మధ్య బాణాసంచా కాల్చకపోవడమే మంచిదని ఈ ఘటన హెచ్చరికగా నిలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.