Krishna District News: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. విషసర్పాలు అధికంగా సంచరిస్తుంటాయి. పొలాల్లో నాట్లు వేసే సమయం కావడంతో.. కప్పలు, ఎలుకలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వాటిని తినేందుకు వచ్చే పాములు కూలీలను కాటు వేయడం పరిపాటిగా జరుగుతుంది. కలుగులో ఉన్న ఎలుకలు, కప్పలు బయటకు వస్తుండటంతో.. పాముల సంచారం కూడా పెరుగుతోంది. అయితే.. పొలాల వద్ద పనులు చేసేందుకు వెళ్లే రైతులను పాములు కాటు వేసి ప్రాణాలను తీస్తున్నాయి. దీంతో రైతులు, కూలీలకు పాముల భయం పట్టుకుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో.. అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వ్యవసాయ పనులను ముమ్మరంగా సాగుతున్నాయి. వాతావరణం చల్లబడటంతో.. పుట్టల నుంచి పాములు విపరీతంగా బయటకు వస్తుండటంతో పొలాలకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవీ మండలాల్లో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. దివిసీమలో పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకునే రైతులు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు, కూలీలు పనులకు వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతోనే వెళుతున్నారు. 2019లో దివిసీమలో అనేక మంది కూలీలు, రైతులు పాముకాట్లకు గురైన ఘటనలు అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 350కిపైగా పాముకాటు కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే 350 కేసులు నమోదయ్యాయి. ఇక.. కోడూరు, చల్లపల్లి పీహెచ్‌సీలో కూడా అధిక సంఖ్యలో పాముకాట్లకు గురయ్యారు.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే.. దివిసీమలో తాజాగా ఖరీఫ్ సీజన్‌లో పాముకాట్లకు గురైన వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జులై 12 వరకు కృష్ణా జిల్లాలో 208 పాము కాటు కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ప్రారంభం అయితే.. మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్‌లో దివిసీమ ప్రాంతంలోని వరిపొలాల్లో త్రాచుపాములు, రక్తపింజెర, కట్లపాము, బురదకొయ్య పాములు సంచరిస్తున్నాయి. రక్తపింజర కాటు వేస్తే రక్తం బాగా కారుతుంది. కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాలకు ప్రమాదకరం. తాచుపాము కాటు వేస్తే.. నరాల నుంచి మెదడుకు విషం చేరి కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. ఇక.. కట్లపాము వేస్తే.. రక్తంలోకి, నరాల్లోకి విషయం చేరుతుంది. అరగంటలోపు మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
పొలాల్లోకి వెళ్లి పనులు చేసే సమయంలో రైతులు, కూలీలు ఏదైనా పాముకాటుకు గురైనట్లయితే.. కొందరు ఇప్పటికీ వేపాకు పసరు తినిపించడం, నాటు వైద్యులను సంప్రదించడం వంటివి చేస్తున్నారు. అయితే.. పాముకాటుకు గురైన వారు నాటు వైద్యులకు సంప్రదించకుండా.. ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. పాము కాటు వేసిన తర్వాత వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేరుకోవడం ద్వారా వారి ప్రాణాలను రక్షించడం సులువు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ చేయండి..