రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నాడు ఎస్పీ పేరిట ఫేక్ ఫేస్‌బుక్.. నేడు ఏకంగా కలెక్టర్‌ను టార్గెట్ చేసుకుని..

|

Dec 11, 2020 | 9:31 PM

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు ఉన్నతాధికారులనే భయం ఏమాత్రం లేకుండా పెట్రేగిపోతున్నారు. వారి పేరిట అయితే తమన పని సులువు అవుతుందని భావించి..

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. నాడు ఎస్పీ పేరిట ఫేక్ ఫేస్‌బుక్.. నేడు ఏకంగా కలెక్టర్‌ను టార్గెట్ చేసుకుని..
Follow us on

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారు ఉన్నతాధికారులనే భయం ఏమాత్రం లేకుండా పెట్రేగిపోతున్నారు. వారి పేరిట అయితే తమన పని సులువు అవుతుందని భావించి ఈ చర్యలకు పాల్పడుతున్నారేమో. ఓ విధంగా చెప్పుకోవాలంటే అధికారులకు సైబర్ నేరగాళ్లు ఛాలెంజ్ విసురుతున్నారనే చెప్పాలి. తాజాగా కర్నూలు జిల్లా కలక్టర్ వీరపాండ్యన్ పేరు మీద సైబర్ నేరగాళ్లు నకిలీ మెయిల్ ఐడీని క్రియేట్ చేశారు. ఆ ఐడీతో కొన్ని కార్యకలాపాలు నిర్వహించారు. అయితే ఈ ఫేక్ ఐడీని గుర్తించిన కలెక్టర్ వీరపాండ్యన్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. తన పేరిట నకిలీ మెయిల్ ఐడీని సృష్టించారని, ఆ ఐడీకి ఎవరూ రెస్పాండ్ అవ్వొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత నకిలీ ఐడీపై సైబర్ క్రైమ్ పోలీసులకు కలెక్టర్ వీరపాండ్యన్ ఫిర్యాదు చేశారు. తన పేరిట నకిలీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మెయిల్ ఐడీ క్రియేట్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలాఉంటే తెలంగాణలోని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట కొందరు దుండగులు ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫేస్‌బుక్ ఐడీ ద్వారా తాను ఎస్పీనని చెప్పుకుంటూ వ్యక్తుల వద్ద నుండి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు కలెక్టర్ పేరిట జీమెయిల్ ఓపెన్ చేసిన దుండగులు కూడా అదే ఉద్దేశంతో చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కలెక్టర్ ఆదేశాల మీదనే పని చేస్తుంటుంది. పరిపాలనా పరమైన లావాదేవీలు అన్నీ కలెక్టర్ ద్వారానే నడుస్తాయి. ఇలాంటి తరుణంలో కలెక్టర్ పేరిట నకిలీ జీమెయిల్‌ను క్రియేట్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. కలెక్టర్ వెంటనే పసిగట్టడంతో పెద్ద నష్టమే తప్పిందని అధికారులు చెబుతున్నారు.