
అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఆర్వీనగర్ సమీపంలో గల బూడిదపాకలు గ్రామంలోనిది ఈ దృశ్యం. ఒక చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పట్టాయి. ఆ చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకు తేనె పట్టు కనిపించడం గమనార్హం. ఇదేదో ఈ ఏడాది జరిగిన వ్యవహారం కాదు. ప్రతి ఏటా ఇంతే. దీంతో ప్రతియేట ఆ తేనెను సొంతం చేసుకున్నందుకు పోటీ పడుతుంటారు గిరిజనలు. వేలంపాట వేసి మరి.. తేనె పట్లు విక్రయిస్తారు. అల్లూరి ఏజెన్సీలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఏడాది ఈ చెట్టుకు తేనె పట్లు పదుల సంఖ్యలో పట్టడం.. ప్రత్యేకత. ఈ తేనె పట్లుకు వేలం పాట పెట్టీ వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఈ ఒక్క చెట్టుకు పట్టిన తేనె ద్వారా ఏటా 80 వేల నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా ఆ చెట్టుకు పట్టిన పదుల సంఖ్యలోని తేనె పట్లను వేలం పాటకు సిద్ధం చేస్తున్నారు గ్రామ పెద్దలు.
సాధారణంగా.. ఎక్కడైనా తేనె పట్టు కనిపిస్తే ఎంత ఆసక్తిగా చూస్తామో.. ఆ తేనెటీగల నుంచి అంతే భయపడతాం. తేనెటీగల గుంపు లేచిందంటే చాలు అక్కడున్న పరుగులు పెట్టాల్సిందే.. పొరపాటున ఒక్కటి చిటుక్కున కుట్టిందంటే.. అంతే మరి. అందుకే తేనెటీగల జోలికి వెళ్లాలంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు.. కానీ బూడిద పాకల గ్రామస్తులకు ఆ భయం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా వాళ్లకు.. ఈ పరిణామం సాధారణంగా మారిపోయింది. అందుకే ఆ తేనెటీగలను వాళ్లంతా.. తనకు ఆదాయాన్ని ఇచ్చే దైవంగా భావిస్తారట. తేనెపట్ల జోలికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కాగా అక్కడ జీవించేందుకు అనుకూల వాతావరణం ఉండటంతో తేనె టీగలు ఆ చెట్టును ఆవాసంగా వినియోగించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.