అది ‘తేనె చెట్టు’..! కొమ్మకొమ్మకు పట్టు… ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా..?!
ఆ చెట్టు.. కొమ్మకొమ్మకు తేనె పట్టు..! ఎస్.. మీరు వింటున్నది నిజం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఓ చెట్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో చెట్లకు తేనె పట్టు పట్టడం సహజం. కొన్ని చెట్లకు ఒకటో రెండో తేనె పట్లు ఉంటాయి. కానీ.. ఒకే చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పెట్టడం.. కొమ్మ కొమ్మకు తేనె పట్లు వేలాడుతూ కనిపించడం ఎప్పుడైనా చూశారా..? ఇప్పుడు ఆ దృశ్యం తెగ వైరల్ అవుతోంది..

అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఆర్వీనగర్ సమీపంలో గల బూడిదపాకలు గ్రామంలోనిది ఈ దృశ్యం. ఒక చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పట్టాయి. ఆ చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకు తేనె పట్టు కనిపించడం గమనార్హం. ఇదేదో ఈ ఏడాది జరిగిన వ్యవహారం కాదు. ప్రతి ఏటా ఇంతే. దీంతో ప్రతియేట ఆ తేనెను సొంతం చేసుకున్నందుకు పోటీ పడుతుంటారు గిరిజనలు. వేలంపాట వేసి మరి.. తేనె పట్లు విక్రయిస్తారు. అల్లూరి ఏజెన్సీలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఏడాది ఈ చెట్టుకు తేనె పట్లు పదుల సంఖ్యలో పట్టడం.. ప్రత్యేకత. ఈ తేనె పట్లుకు వేలం పాట పెట్టీ వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఈ ఒక్క చెట్టుకు పట్టిన తేనె ద్వారా ఏటా 80 వేల నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా ఆ చెట్టుకు పట్టిన పదుల సంఖ్యలోని తేనె పట్లను వేలం పాటకు సిద్ధం చేస్తున్నారు గ్రామ పెద్దలు.
సాధారణంగా.. ఎక్కడైనా తేనె పట్టు కనిపిస్తే ఎంత ఆసక్తిగా చూస్తామో.. ఆ తేనెటీగల నుంచి అంతే భయపడతాం. తేనెటీగల గుంపు లేచిందంటే చాలు అక్కడున్న పరుగులు పెట్టాల్సిందే.. పొరపాటున ఒక్కటి చిటుక్కున కుట్టిందంటే.. అంతే మరి. అందుకే తేనెటీగల జోలికి వెళ్లాలంటే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు.. కానీ బూడిద పాకల గ్రామస్తులకు ఆ భయం లేదు. ఎందుకంటే ప్రతి ఏటా వాళ్లకు.. ఈ పరిణామం సాధారణంగా మారిపోయింది. అందుకే ఆ తేనెటీగలను వాళ్లంతా.. తనకు ఆదాయాన్ని ఇచ్చే దైవంగా భావిస్తారట. తేనెపట్ల జోలికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కాగా అక్కడ జీవించేందుకు అనుకూల వాతావరణం ఉండటంతో తేనె టీగలు ఆ చెట్టును ఆవాసంగా వినియోగించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
