Andhra Pradesh: నడి ఊర్లో సమాధి.. అది ఎవరిది.. ఊరి మధ్యలో ఎందుకు ఉంది..?

|

Mar 09, 2022 | 6:28 PM

కడప జిల్లాలో ఓ అరుదైన సమాధి ఉంది. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో గల ఆ సమాధికి 120ఏళ్లు.. గుడిపాడు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది ఈ సమాధి.

Andhra Pradesh: నడి ఊర్లో సమాధి.. అది ఎవరిది.. ఊరి మధ్యలో ఎందుకు ఉంది..?
Elephant Grave
Follow us on

Kadapa district: కడప జిల్లాలో ఓ అరుదైన సమాధి ఉంది. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో గల ఆ సమాధికి 120ఏళ్లు.. గుడిపాడు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది ఈ సమాధి. అయితే, ఇంతకు ఈ సమాధి ఎవరిది..? ఈ విషయం ఇప్పటి తరానికి ఎవరికీ తెలియదు. అదేంటో.. ఈ సమాధి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అహోబిల మఠానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణంలో కూడా అహోబిల మఠం, ఆలయం ఉంది. 120 ఏళ్ల కిందట అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని కుంభకోణం దైవ క్షేత్రం నుండి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గల అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి రాకపోకలు జరుగుతుండేవి. ఆ కాలంలో కుంభకోణం దేవస్థానం నుండి బ్రాహ్మణులు ఏనుగుల పైన ప్రయాణిస్తూ అహోబిలం చేరేవారు. ఇదే రీతిలో 1902 వ సంవత్సరంలో కుంభకోణం నుండి అహోబిలం వస్తుండగా మఠాధిపతుల ఏనుగు జబ్బుపడింది. కుంభకోణం నుండి సుమారు 500 కిలో మీటర్లు ప్రయాణించిన ఏనుగు అక్కడ్నుంచి ముందుకు వెళ్ళలేక, అక్కడే కన్నుమూసింది.

ఆహోబిల మఠం నిర్వాహకులు గ్రామస్తుల సహకారంతో మరణించిన ఏనుగును రహదారిపక్కనే ఖననం చేశారు. అక్కడ సమాధిని నిర్మించారు. ఏనుగు శిలా విగ్రహాన్ని కూడా సమాధివద్ద ప్రతిష్టించారు. ప్రతి ఏటా వారు అహోబిలం వెళ్ళే సమయంలో ఈ ఏనుగుసమాధి వద్ద ఆగి,  పూజ చేసి వెళ్లే వారని, కాల క్రమంలో అహోబిలం మఠం వారు ఇటు రావడం మానేశారని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.
గతంలో అహోబిం మఠంవారు ఇక్కడ ఆగడానికి గల కారణం గుడిపాడులో ఒక కోనేరు ఉంది. అక్కడ వారి ఏనుగులు, గుర్రాలు సేదతీరడానికి ఆపేవారని స్థానికులు చెబుతున్నారు. కాల క్రమేణా స్థానిక గ్రామస్తులు కూడా ఇక్కడ మంచి జరగాలని కోరుతూ కొబ్బరికాయలు కొట్టడం, మొక్కులు చెల్లించుకోవటం చేస్తున్నారు. ప్రయాణాలు మొదలుపెట్టేముందర..ఏనుగు సమాధి వద్ద ఆగి కొబ్బరి కాయ కొట్టడం, పూజలు చేయడం వంటివి ఇప్పటికీ కొనసాగిస్తుంటారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ ఏదైనా పని అనుకుని దండం పెట్టుకుని వెళితే విజయం జరుగుతుందనేది గ్రామస్తుల విశ్వాసం.

 

Also Read: Viral: అన్నం తినే ప్లేట్‌లో సెల్‌ఫోన్‌కూ ప్లేస్.. నెట్టింట ఫోటో ట్రెండింగ్