ఎన్టీఆర్‌జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి పీక్స్‌కి వెళ్తోంది. ఈ సెగ్మెంట్‌లో విజయకేతనం ఎగురవేయాలని అటు వైసీపీ ఇటు టీడీపీ పట్టుదలతో ఉన్నాయి. నోటిఫికేషన్ సంగతి పక్కనపెట్టి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వైసీపీ ఇన్‌ఛార్జ్ స్వామిదాస్ గడపగడపను టచ్ చేస్తుంటే.. టీడీపీ ఇన్‌ఛార్జ్ కొలికపూడి శ్రీనివాస్ సమావేశాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నేతల సమావేశంలో కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. స్వామిదాస్ టార్గెట్‌గా వ్యక్తిగత దూషణలకు దిగారాయన.
కొలికపూడి కామెంట్లకు గట్టిగానే బదులిచ్చారు స్వామిదాస్. అమరావతి రైతుల దగ్గర డబ్బు వసూలు చేసిన బ్లాక్‌మెయిలర్ తమపై విమర్శలు చేయడమేంటని విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు, అభివృద్ధిపైనా విమర్శలు చేసుకుంటే పర్లేదు. కానీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబసభ్యుల్ని టార్గెట్ చేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హీటెక్కిన ఏపీ రాజకీయాలు
కాగా కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ చెప్పు చూపించారు. పెళ్ళిళ్ల ప్రస్తావన తీసుకురావొద్దని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. దీనికి కౌంటర్‌గా మాజీ మంత్రి పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ప్రజల్ని నమ్ముకుంటేనే అసెంబ్లీకి వెళ్తారని.. పక్క పార్టీ నేతల్ని నమ్ముకుంటే అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేవని హితవు పలికారు. ఆ తర్వాత చెప్పు రాజకీయం ఏపీని హీటెక్కించింది.
మళ్లీ చాలా రోజుల తర్వాత పొలిటికల్ తెరపై చెప్పు ప్రత్యక్షమైంది. అది కూడా ఎంపీ మార్గాని భరత్ చేతిలో. రాజమండ్రి సిటిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారాయన. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి మార్గాని ఇచ్చిన వార్నింగ్ ఇది. మహిళా వాలంటీర్‌ను బెదిరించారని ఆడియో వినిపించి మరీ చెప్పు చూపించారు.