
ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జనం ఇళ్ళల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. పొదిలి, ముండ్లమూరు, దర్శి మండలాల్లో ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు ప్రజలు గుర్తించారు. దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో ఆరు నెలల క్రితం వరుసగా మూడు రోజుల పాటు భూమి కంపించింది. దీంతో ఆ మూడు రోజులు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.
తాజాగా పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. తరచూ ఈ ప్రాంతాల్లోనే భూమి కంపించడంపై అధికారులు పరిశోధనలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే గతంలో దర్శి ప్రాంతంలో సంభవించిన భూ ప్రకంపనలపై అధికారులు పరిశోధనలు చేశారు. గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలోని భూముల్లో పొరలు సర్దుబాటు అవుతుంటాయని, ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో భూమి లోపలి పొరలు సర్దుబాటు అయ్యే సమయంలో ప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు తేల్చారు.
ఇప్పుడు కూడా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే పొదిలి, దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రకంపనాలు సాధారణంగా నదీపరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో జరుగుతుంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..