
వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేయడం, గాడిదలకు పెళ్లిళ్లు నిర్వహించడం వంటి వింత ఆచారాల గురించి విని ఉంటాం. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం మరో ఆసక్తికరమైన సంప్రదాయం కొనసాగుతోంది. వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు ఓ కుక్కను కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి పూజించడం ఇక్కడ ప్రత్యేకతగా మారింది.
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విత్తనాలు వేసే సమయం దాటిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. మబ్బులు కమ్ముకుంటున్నా వర్షపు చినుకులు పడకపోవడంతో పంటలపై ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో విడపనకల్లు మండలంలోని కొట్టాలపల్లి గ్రామంలో గ్రామస్తులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించారు. ఒక సునకాన్ని కాటమరాయుడి ప్రతిరూపంగా భావించి ప్రత్యేకంగా అలంకరించారు. కుక్కకు పసుపు, కుంకుమ రాసి, మెడలో పూలమాల వేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
గ్రామస్తులంతా కలిసి వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. పంచభక్ష పరమాణ్ణాలతో పాటు ప్రత్యేకంగా వండిన భోజనాన్ని కుక్కకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆ కుక్కకు ఆహారం పెట్టారు. కుక్క భోజనం చేసిన తర్వాత దానిని గ్రామంలోకి వదిలిపెట్టడం ఈ సంప్రదాయంలో కీలకమైన భాగంగా చెబుతున్నారు. ఈ ఆచారంలో మరో ఆసక్తికరమైన నమ్మకం ఉంది. కుక్క భోజనం చేసిన తర్వాత దానికి నీళ్లు ఇవ్వకుండా గ్రామంలోకి వదిలేస్తారు. అనంతరం అదే భోజనాన్ని గ్రామస్తులు ప్రసాదంగా భావించి కలిసి తింటారు. నీటి కోసం కుక్క ఇబ్బంది పడే పరిస్థితిని చూసి వానదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని గ్రామస్తులు విశ్వసిస్తారు.
కేవలం వర్షం కురవాలని మాత్రమే కాకుండా.. సమృద్ధిగా వానలు పడి చెరువులు, బావులు నిండాలని, పంటలు బాగా పండాలని గ్రామస్తులు కోరుకున్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు వర్షమే ప్రధాన ఆధారంగా మారడంతో దేవుడిని తమకు తెలిసిన పద్ధతిలో ప్రార్థిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. సీమ ప్రాంతంలో వర్షాల కోసం గ్రామీణులు తమ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న వివిధ సంప్రదాయాలను పాటిస్తుంటారు. శాస్త్రీయంగా ఇలాంటి ఆచారాలకు వర్షపాతాన్ని ప్రభావితం చేసే ఆధారం లేకపోయినా.. అవి గ్రామీణ సమాజంలో ఉన్న విశ్వాసాలు, సామూహిక భావోద్వేగాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి.