
ఏపీలో జిల్లాలవారీగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాల వారీగా మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 23 రాజమండ్రిలో టీడీపీ నేత లోకేష్, పవన్ కల్యాణ్ ల మధ్య సమావేశం జరిగింది. దానికి కొనసాగింపుగా మొదటి రోజు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదారి, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో సమావేశాలు జరిగాయి. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల నేతల సమన్వయంతో ముందుకు వెళ్లేలా ఈ కమిటీలు పనిచేస్తాయి.
రెండు పార్టీల నాయకులు మధ్య సమన్వయం చేసుకునేలా ఈ కమిటీలు పనిచేస్తాయి. రెండు పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను సమన్వయ కమిటీల్లో నియమించారు. రెండు పార్టీల్లో అసంతృప్తి లేకుండా గెలుపే లక్ష్యంగా సమన్వయ కమిటీలు దిశానిర్దేశం చేయనున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ కమిటీలు చూస్తాయి.
2024 ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహులను బుజ్జగించి రెండు పార్టీలకు నష్టం కలగకుండా ఈ సమన్వయ కమిటీలు చూస్తాయి. మేనిఫెస్టో రూపకల్పనపై కూడా ఈ కమిటీల్లో చర్చించారు. ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేయాలని సమన్వయ కమిటీల్లో నేతలు తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సమన్వయ కమిటీ సమావేశాల్లో నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలనే కూటమి లక్ష్యమన్నారు. నవంబర్ 1న రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నాయి.
ఉమ్మడి జిల్లాల వారీగా మూడు రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సమావేశాలు జరిగాయి. నవంబర్ 1న ప్రకటించే ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తుతో పాటు రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి చేయాల్సిన ఆందోళనలపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో రెండు పార్టీల క్యాడర్ మధ్య భేదాభ్రిపాయాలు లేకుండా చేయడంపైనా ఫోకస్ పెట్టారు. రేపు పశ్చిమగోదావరి, కృష్ణా, కడప, చిత్తూరు జిల్లాల్లో.. ఎల్లుండి విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి