YSRCP: బెట్టు వీడుతున్న నేతలు.. వైసీపీలో చల్లబడుతున్న అసంతృప్తి స్వరాలు

|

Feb 05, 2024 | 6:40 PM

వైసీపీలో అసంతృప్తి స్వరాలు చల్లబడుతున్నాయి..! అధిష్ఠానంపై అలకవహించిన నేతలు..బెట్టువీడుతున్నారు..! కొత్త ఇన్‌ఛార్జ్‌ల విజయంతో పాటు సీఎం జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో అటు క్యాడర్‌లోనూ.. ఇటు నేతల్లోనూ జోష్‌ నెలకుంటోంది.

YSRCP: బెట్టు వీడుతున్న నేతలు.. వైసీపీలో చల్లబడుతున్న అసంతృప్తి స్వరాలు
CM Jagan with YSRCP MLAs
Follow us on

ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 5:  సామాజిక స‌మీక‌ర‌ణాలు.. స్థానిక ప‌రిస్థితులు.. ఫైనల్‌గా గెలుపు అవకాశాలు..! ఇలా పలు అంశాల ఆధారంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో మార్పులు చేపట్టారు..వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పటివరకూ 6 విడతల్లో మొత్తం 64 అసెంబ్లీ స్థానాల‌కు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. అలాగే లోక్ సభకు సంబంధించి 16 మందిని ఇన్‌ఛార్జ్‌లుగా ప్రకటించారు. మరిన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అసంతృప్తి స్వరం వినిపించిన పలువురు నేతలు క్రమంగా చల్లబడుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థి విజయానికి పనిచేస్తామని ప్రకటిస్తున్నారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్థానంలో.. మంత్రి మేరుగు నాగార్జునకు కేటాయించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఈ క్రమంలో అలక వహించిన సుధాకర్‌బాబు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు సుధాకర్‌ బాబు. టికెట్ విషయంలో అధిష్ఠానం మాటే వేదమని.. జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు శతవిధాలా కృషి చేస్తానని ప్రకటించారు.

అటు పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా చల్లబడ్డారు. మార్పుల్లో భాగంగా పి.గన్నవరం స్థానాన్ని విప్పర్తి వేణుగోపాల్‌కు ఇచ్చింది అధిష్ఠానం. దీంతో అప్పటినుంచి అసంతృప్తిగా ఉన్నారు చిట్టిబాబు. ఈ క్రమంలో భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తానని చిట్టిబాబుకు భరోసా ఇచ్చారు..సీఎం జగన్‌. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు.. వైసీపీ విజయం కోసం చివరి వరకూ జెండా మోస్తానని ప్రకటించారు. పి.గన్నవరంలో వైసీపీ విజయానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ కాస్త అసంతృప్తి అనిపించిన ఈ రెండు నియోజకవర్గాల్లో నేతలతో మాట్లాడి ఒప్పించారు జగన్. అసమ్మతి ఉందని ప్రచారం జరిగిన రెండు నియోజకవర్గాల్లో నేతలను దారికితెచ్చి గతంకంటే బలోపేతం చేశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అసంతృప్తులే ఆయుధంగా టీడీపీ ప్రయత్నాలు చేసింది. కానీ.. జగన్ వ్యూహాలతో టీడీపీ ఆశలకు అడ్డుకట్ట పడే పరిస్థితి వచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..