
ఏకాదశి వేళ ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కార్తీకమాసం, ఏకాదశికి తోడు శనివారం కావడంతో శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 9మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం 11.45 నిమిషాల ప్రాంతంలో స్వామివారి దర్శనానికి భక్తులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. మేం ముందు అంటే మేమే ముందు అంటూ తోసుకున్నారు. ఫలితంగా రెయిలింగ్ మీదనుంచి ఒకరి తర్వాత ఒకరు అరుపులు, కేకలతో కిందపడిపోయింది. భక్తుల తోపులాటకు మెట్లకున్న రెయిలింగే ఊడి బయటకొచ్చేసింది. కాంక్రీట్ మెట్లకు బలంగా బిగించిన రెయిలింగ్ ఊడి పడిపోవడంతో ఘోరం జరిగింది..
కాగా.. కాశీబుగ్గ ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పాండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి 2 వేల మంది భక్తులు వస్తుంటారని, ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదన్నారు . భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను. ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. ఇంత మంది వస్తారని తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్నారు పాండా.. ఎప్పుడూ కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ పేర్కొన్నారు.
ఆలయంలోనే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
కాగా.. కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు అధికారులతో కమిటీ వేసిన కలెక్టర్ స్వప్నిల్.. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టెక్కలి ఆర్డీవో, ఏఎస్పీతో పాటు.. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌తో కమిటీ ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..