
దేవరగట్టు బన్నీ ఉత్సవం ఈసారి విజయవంతమైంది.. గతంతో పోలిస్తే రక్తాలు కారడాలు ఒక మోస్తరుగా తగ్గాయి. పోయిన ప్రాణాల సంఖ్య కూడా గతం కంటే తక్కువే… అని సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పోలీసులు. కర్రల సమరం తర్వాత నెత్తుటి మడుగుల్ని లెక్కబెట్టుకుని, ఊరిజనంలో మార్పు కనిపిస్తోంది.. మా ప్రయత్నం ఫలించింది అని ఖాకీసార్లు వాళ్లకు వాళ్లు సెభాష్ చెప్పుకున్నారు. కానీ.. దేవరగట్టు జనం మారారన్న మాటైతే శుద్ధ అబద్ధం. వాళ్ల మైండ్‌సెట్ ఇంకా ఎరుపు రంగులోనే ఉంది. దేవరగట్టు ఒక్కటే కాదు, హింసకు-ఆచారానికి లింకుపెట్టి చేసుకునే పండగలన్నీ ఏ యేటికాయేడు రక్తచరిత్రల్ని తిరగరాస్తూనే ఉన్నాయి. ఒక ఊరి సంప్రదాయం.. ముగ్గురి ఉసురు తీసుకుంది. 90 మంది ప్రాణాల్ని గాల్లో దీపాల్లా మార్చేసింది. వీళ్లలో ఎనిమిదిమంది మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంతజరిగినా, తాత్కాలికంగా వాయిదా పడినట్టే పడి, మళ్లీ కొనసాగింది బన్ని ఉత్సవం. దేవరగట్టులో యుద్ధం తర్వాత ప్రశాంతత అక్కడ స్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. దేశమంతా, ముఖ్యంగా హైందవ సమాజమంతా విజయదశమిని స్వచ్ఛమైన మనసుతో జరుపుకుంటే, కొత్త బట్టలతో పిండివంటలతో లోగిళ్లన్నీ కళకళలాడుతుంటే.. ఆ ఊరు మాత్రం దశమి మరునాడు ఆర్తనాదాలతో, చావు వార్తలతో తెల్లారింది. వెయ్యిమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కర్రలు పైకే లేచాయి. తలలు టెంకాయల్లా పగిలాయ్.. చాలామందికి కాళ్లూచేతులు, నడుములు విరిగాయి. ఆచారం మాటున, మద్యం మత్తులో పాత కక్షలు కూడా భగ్గుమని, పోలీసుల ఆంక్షలన్నీ గాలికెగిరిపోయి ఆ ఊర్లో నెత్తుటి క్రీడ...