శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విషాదం చోటుచేసుకుంది. వివాహం కావడం లేదని మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కపట్నానికి చెందిన ప్రభాకర్ గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. 30 సంవత్సరాలు దాటినా వివాహం కాకపోవడంతో పెళ్లి కాలేదని నిత్యం మదన పడుతుండేవాడు. తనకు వివాహం చేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. అయితే కొన్ని అప్పులు ఉన్నాయని.. అవి తీరాక సంబంధాలు చూస్తామని ఇంట్లో వాళ్లు చెబుతుండేవారు.
దీంతో ప్రభాకర్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాడు. తనకు ఇక పెళ్లి కాదేమో అని ఆవేదన చెందాడు. ఆ బాధతోనే బుధవారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి విషం తాగాడు. స్థానికులు గుర్తించి అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రభాకర్‌ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభాకర్ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏ సమస్యకి అయినా కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఈ రోజు భరించలేము అనిపించిన విషయం.. రేపటికి కాస్త వెయిట్ తగ్గుతుంది. కాలమే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. విలువైన జీవితాన్ని ఇలా అర్థాంతరంగా ముగించి.. అయినవాళ్లకు కన్నీళ్లు మిగల్చవద్దు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..