ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు లోకేశ్ పాదయాత్ర చేపట్టనున్నారు. సంవత్సరం పాటు ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పాదయాత్ర మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. అంతే కాకుండా పలు బహిరంగ సభల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. లోకేశ్ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై స్పష్టత లేదు. తాజాగా ఆయనే ప్రకటించడంతో క్లారిటీ వచ్చేసింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సుదీర్ఘంగా యాత్ర చేపట్టేందుకే నారా లోకేశ్ మొగ్గు చూపారు. జనవరి 26న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పంకు లోకేశ్ వెళ్తారు. 27న పాదయాత్రను ప్రారంభిస్తారు. పాదయాత్రకు సంబంధించి పలు టీమ్ లను ఏర్పాటు చేసే దిశగా టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. పాదయాత్ర చేపట్టి అధికారం కైవసం చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్లో అభిమానం చూరగొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారం చేజిక్కించుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం