Cyclone Asani: అసని అల్లకల్లోలం.. కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగాన్ని తాకే ఛాన్స్..

|

May 11, 2022 | 6:58 AM

ఏపీ తీరంలో అసని అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఉగ్రరూపం దాల్చి, తీరంవైపు దూసుకొస్తోంది. కాసేపట్లో మచిలీపట్నం సమీపంలో తీరాన్ని తాకనుంది. అసని తుఫాను ప్రభావంతో, కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో వర్షాలు..

Cyclone Asani: అసని అల్లకల్లోలం.. కాసేపట్లో మచిలీపట్నం వద్ద భూభాగాన్ని తాకే ఛాన్స్..
Cyclones Asani
Follow us on

ఏపీ తీరంలో అసని అల్లకల్లోలం(Cyclone Asani) సృష్టిస్తోంది. ఉగ్రరూపం దాల్చి, తీరంవైపు దూసుకొస్తోంది. కాసేపట్లో మచిలీపట్నం సమీపంలో తీరాన్ని తాకనుంది. అసని తుఫాను ప్రభావంతో, కోనసీమ జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రతతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను తీరం దాటుతుందన్న హెచ్చరికలతో, అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. దిశ మార్చుకున్న అసని తుపాను.. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. అర్ధరాత్రి నుంచి తీవ్రత మరింత పెరగనుంది. బుధవారం ఉదయానికి అమలాపురం-కాట్రేనికోన మధ్య తుపాను తీరాన్ని తాకుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. తుఫాను ‘అసాని’ని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF) మొత్తం 50 బృందాలను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో 12 బృందాలు, ఆంధ్రప్రదేశ్‌లో 9, ఒడిశాలోని బాలాసోర్‌లో ఒక బృందాన్ని మోహరించాయి.

తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్‌ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను రక్షిత భవనాలనూ సిద్ధంగా ఉంచారు.

కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్‌లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వివరించారు.