AP Rains: వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్

| Edited By: Ravi Kiran

Nov 27, 2024 | 9:00 AM

ఫెంగల్‌ తుఫాను భయం ఏపీని వణికిస్తోంది.. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుపాను ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains: వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
Andhra Weather
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్తా తుఫానుగా మారనుంది. మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీనపడుతుందని ముందుగా వాతావరణ శాఖ అంచనాలు వేసింది. కానీ అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ తుఫానుగా మారనుంది. తుఫాన్‌కు ఫెంగల్ తుఫాన్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న తుఫాన్ ప్రభావం మూడు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి అది కదులుతున్న మార్గాన్ని బట్టి పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత తుఫాన్ బలహీనపడి తీరం దాటినా మరొక మూడు రోజులపాటు దారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడు పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌పైనా ఫెంగల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీలో నేటి నుంచి గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని రేపటి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడును ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా రాయలసీమపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో 48 గంటల తర్వాత ఉత్తరాంధ్రపై కూడా ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలపింది.

నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య , చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 48 గంటలు దాటిన తర్వాత బాపట్ల, సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. తుఫాన్‌గా మారిన తర్వాత మూడు రోజులకు బలహీనపడి తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినా మరో మూడు రోజుల పాటు తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాలకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ ప్రభావంతో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఒకవైపు.. ఇప్పటికే పెరిగిన చలిగాలుల ప్రభావానికి తోడు వర్షాలతో జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. మరో వారం రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి