ప్రేమించలేదని కోపంతో.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

|

Oct 13, 2020 | 7:17 AM

విజయవాడలో ప్రేమ పేరిట దారుణం జరిగింది. చిన్నారి అనే యువతిపై నాగభూషణం అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ప్రేమించలేదని కోపంతో.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు..
Follow us on

Murder In Vijayawada Name Of Love: విజయవాడలో ప్రేమ పేరిట దారుణం జరిగింది. చిన్నారి అనే యువతిపై నాగభూషణం అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే చనిపోగా.. నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన విజయవాడ హనుమాన్‌పేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో నర్సుగా పని చేస్తున్న చిన్నారి అనే యువతి.. తన స్నేహితురాళ్లతో కలిసి ఆసుపత్రికి దగ్గరలోని రూమ్‌లో అద్దెకుంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం కొద్దికాలంగా ప్రేమ పేరుతో చిన్నారిని వేధిస్తున్నాడు. దీనిపై నాలుగు రోజుల కిందట ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడ్ని పిలిచి పోలీసులు హెచ్చరించడంతో ఇకపై ఆమె వెంటపడను అని రాసిచ్చినట్లు సమాచారం. దీనితో చిన్నారి కంప్లయింట్‌ వెనక్కి తీసుకుంది.

పోలీసులకు తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో చిన్నారిపై నాగభూషణం కక్ష పెంచుకున్నాడు. పక్కా ప్లాన్‌తో మాటు వేసి.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో నాగభూషణం ముందుగానే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలోనే అతనికి మంటలు అంటుకున్నాయి. ఆమె అక్కడిక్కడే చనిపోయింది. 80 శాతం గాయపడ్డ నాగభూషణంను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.