
Visakhapatnam Beach: విశాఖపట్నం సిటీలో సీపీ మనీష్ కుమార్ సిన్హా ఆకస్మికంగా పర్యటించారు. బీచ్ రోడ్డులో కాలి నడకతో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన టీవీ9తో మాట్లాడారు. ఒక్క పిలుపుతో ప్రజలు పూర్తి సహకారమందించారని చెప్పారు. ఇళ్లలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారని ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు. నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని సీపీ మనీష్ ఆకాంక్షించారు. ఈ ఏడాది ప్రత్యేక ఇనీషియేటివ్స్‌తో ముందుకెళ్తామని చెప్పిన ఆయన.. ‘అవినీతి అలసత్వం వద్దు.. ఆత్మాభిమానం ముద్దుం’ నినాదంతో నూతన సంవత్సరం సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ పని చేస్తుందన్నారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు రావొచ్చునని, పూర్తి న్యాయం చేస్తామని సీపీ భరోసా ఇచ్చారు. అయితే, ఫ్యామిలీ పరంగా పోలీస్ స్టేషన్ వరకు రాలేని వారి కోసం ప్రత్యేకంగా ఒక ఫోరాన్ని పెట్టామన్నారు.
ఇదే సమయంలో విశాఖలో డ్రగ్ కల్చర్‌పై సీపీ మనీష్ స్పందించారు. విశాఖలో డ్రగ్ కల్చర్ కొత్త సమస్య కాదన్నారు. డ్రగ్ కల్చర్‌ను సమూలంగా అంతమొందించేందకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నేరాల బారిన పడుతున్న యువతపై కఠిన చర్యలు తీసుకుంటూనే.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతలను పరిరక్షిస్తామన్నారు. మరోవైపు రాజధాని తరలింపుపైనా సీపీ మనీష్ కుమార్ సిన్హా స్పందించారు. రాజధానిని విశాఖకు తరలిస్తే పోలీస్ తరఫున పూర్తి సంసిద్ధంగా ఉన్నామన్నారు. కోవిడ్ నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. అందరూ ఇంకా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సీపీ సూచించారు. వ్యాక్సిన్ త్వరలోనే వస్తే కోవిడ్ నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇదిలాఉండగా, విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు డేగ కన్ను వేశారు. బీచ్ రోడ్డుతో పాటు సిటీ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. ఆర్కే బీచ్‌లో డ్రోన్లతో నిఘా పెట్టారు.
Also read: